రాహుల్ చెప్పినంత ఈజీకాదు..


ఘ‌ర్ వాప‌సీ-అంటే.. కాంగ్రెస్ నుంచి వివిధ కార‌ణాల‌తో దూర‌మైన నాయ‌కుల‌ను.. ఇత‌ర పార్టీల్లో చేరిపోయి న నేత‌ల‌ను తిరిగి కాంగ్రెస్ బాట ప‌ట్టించ‌డం. ఇదే సూత్రాన్ని ఏపీలో అమ‌లు చేయాల‌ని.. పార్టీ కీల‌క నేత‌.. ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవ‌ల జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌కు ఉగ్గుపాల‌తో నేర్పించారు. “మీరు ఇలా చేయండి” అంటూ.. నేత‌ల‌ను ఘ‌ర్ వాప‌సీ దిశ‌గా.. న‌డిపించారు. అయితే.. ఇది అనుకున్నంత ఈజీనా? చెప్పినంత తేలికా? అంటున్నారు కాంగ్రెస్ ఏపీ సీనియ‌ర్లు. ఎందుకంటే.. గ‌తంలో అంటే.. ఏడాదిన్నర కింద‌ట వ‌ర‌కు ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరా రెడ్డి కూడా ఇదే మంత్రాన్ని ప‌ఠించారు.

ఆయ‌న‌కు ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా.. ఘ‌ర్ వాప‌సీ నినాదం అందుకున్నారు. అయితే.. అది స‌క్సెస్ కాలేదు. ఉన్న‌వారు కూడా జంప్ అయిపోయారు. దీంతో విసిగిపోయిన .. ఆయ‌న కాంగ్రెస్‌ను బాగు చేయ‌డం నావ‌ల్ల కాదంటూ.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ ఘ‌ర్ వాప‌సీ మంత్రం అందుకోండ‌ని రాహుల్ చెప్ప‌డం.. పార్టీ నేత‌ల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ అగ్ర‌నేత‌, రాహుల్ చెప్పారు క‌నుక చేసి తీరాల‌ని అంటున్నారు. ఇక‌, రాహుల్ చెప్పిన దాంట్లో కీల‌క‌మైన అంశం.. మ‌న పార్టీ నుంచి దూర‌మైన వారు వైసీపీలో ఉన్నార‌ని.. వారంద‌రినీ కాంగ్రెస్ వైపు మ‌ళ్లించాల‌ని. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇది సాధ్య‌మేనా? అనేది ఏపీ కాంగ్రెస్ నేత‌ల మాట‌.

ఎందుకంటే.. నాయ‌కుడు ఎవ‌రైనా.. ప్ర‌జ‌ల బ‌లం చూసుకుంటాడు. ప్ర‌జ‌లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో చూసుకుని ఆపార్టీవైపు అడుగులు వేస్తాడు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాంగ్రెస్‌ను ఏపీ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. అస‌లు ప్ర‌జ‌ల దృష్టిలో కాంగ్రెస్ విల‌న్‌గా మారిపోయింది. ముందు ఈ మ‌చ్చ‌ను తుడిచేసుకునే ప్ర‌య‌త్నం కాంగ్రెస్ నేత‌లు చేయాల్సి ఉంది. కానీ, ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్‌పై న‌మ్మ‌కం కుదిరే అవ‌కాశం లేదు. ఈ న‌మ్మ‌కం రానంత వ‌ర‌కు పోయిన నేత‌లు తిరిగి వ‌చ్చే అవ‌కాశం అంత‌క‌న్నా లేదు.

అంతేకాదు.. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి వైసీపీలో చేరిన కీల‌క‌నేత‌లు.. బొత్స కుటుంబం, మేక‌పాటి కుటుంబం.. పేర్ని కుటుంబం, రాచ‌మ‌ల్లు కుటుంబం.. ఇలా ఏ కుటుంబాన్ని చూసుకున్నా.. వైసీపీ అధినేత అగ్ర‌స్థానంలో ఉంచారు. ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వీరు ఆ పార్టీని వీడి ఎలా కాంగ్రెస్‌లో చేర‌తారు. పోనీ.. ఆనం వంటి అసంతృప్తుల‌ను చేర‌దీద్దామ‌న్నా.. వీరికి జ‌గ‌న్‌పై ఆశ‌లు స‌న్న‌గిల్ల‌లేదు. ఇంకా స‌మ‌యం రాలేదు. వ‌స్తే.. మా నేత ఏదో ఒకటి చేస్తాడు. అని ఆశ‌ల‌తోనే ఉన్నారు. సో.. ఎలా చూసుకున్నా.. రాహుల్ చెప్పింది అసాధ్య‌మ‌నే అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.