పవన్ మౌనం వెనక భారీ ప్లాన్ ఉందా… ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయన జనసేనను ఏర్పాటు చేసి రాజకీయాలలో చురుకుగా ఉంటానని అప్పట్లో గట్టిగానే చెప్పారు. కానీ ఆయన ఇపుడు సడెన్ గా రూట్ మార్చేశారు. సినిమాల మీద సినిమాలు చేస్తూ సెట్స్ మీదనే ఉంటున్నారు. అయితే పవన్ హీరోగా వేషం కడుతున్నా ఆయన మనసు అంతా ఏపీ రాజకీయాల మీదనే ఉంది అంటున్నారు. ఆయన ఎప్పటికపుడు ఏపీ రాజకీయాల మీద ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని చర్చిస్తున్నారు అని తెలుస్తోంది. పవన్ ఇపుడు సైలెంట్ గా ఉండడం చాలా అవసరం, వ్యూహాత్మకం అని కూడా చెబుతున్నారు.

ఏపీలో వైసీపీని ఢీ కొట్టే పార్టీగా టీడీపీ ఉంది. ఈ సమయంలో పవన్ జనసేన పేరిట వచ్చి రచ్చ చేసినా ఓట్ల చీలిక తప్ప మరేమీ కాదు అనే అంటున్నారు. మరో వైపు పవన్ బయటకు వస్తే ఎన్నో చెప్పాలి. మీడియాకు కూడా సమాధానాలు చెప్పాలి. వాటిలో ఫ్యూచర్ పాలిటిక్స్ కి సంబంధించిన విషయాలు కనుక బయట పడితే ఇబ్బంది. అందుకే పవన్ కొంతకాలం పాటు పాలిటిక్స్ కి విరామం ప్రకటించారు అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలి, వైసీపీని ఎలా దించాలి అన్న దాని మీద పవన్‌కి కచ్చితమైన క్లారిటీ ఉంది అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తాపీగా తన సినిమాలు తాను చేసుకుంటున్నార‌ట.

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసికట్టుగా పోటీ చేస్తాయని చెబుతున్నారు. ఈ విషయంలో రెండవ మాట కూడా ఉండకపోవచ్చు అని కూడా చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తులో భాగంగా కొన్ని మంత్రి పదవులతో పాటు, ఉప ముఖ్యమంత్రి కూడా టీడీపీ వైపున ఇస్తారని చెబుతున్నారు. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండడంతో ఆ పార్టీతో కలసి టీడీపీ జనసేన వెళ్తాయని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకుని సత్తా చాటకపోతే 2029 నాటికి జనసేన మనుగడ ఉండదు అని కూడా భావిస్తున్న నేపధ్యంలోనే పవన్ పొత్తులకు ఓకే అంటారని చెబుతున్నారు.

అయితే పవన్ బీజేపీ కలసి పోటీ చేయాలని, టీడీపీ వామపక్షాల‌తో కలసి రావాలని, అలా ఏపీలో విపక్షాలలో చీలిక రావాలని వైసీపీ గట్టిగా కోరుకుంటోంది. అందుకే ఆ పార్టీ అనుకూల మీడియా నుంచి పవన్ స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమించాలని, ప్రజా సమస్యల మీద జనంలోకి రావాలని డిమాండ్స్ వస్తున్నాయి. కానీ పవన్ తెలివైన ఎత్తుగడలోనే ఉన్నారు. కాబట్టే ఆయన ఇప్పట్లో ఎలాంటి రాజకీయ పోరాటాలకు రెడీగా ఉండరు అంటున్నారు. అంటే వైసీపీ పెట్టుకున్న ఓట్ల చీలికకు పవన్ ససేమిరా అన్న మాట. మొత్తానికి 2014 నాటి కూటమి కనుక ఎదురైతే వైసీపీకి అది రాజకీయంగా ఇబ్బందికరమే అంటున్నారు.