థియేటర్లు వెలవెల

పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ పుంజుకున్న తీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించగా.. ఆ తర్వాత సంక్రాంతి సినిమాలతో సందడి మరో స్థాయికి చేరుకుంది. ఇక తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేదు. విషయం ఉన్న సినిమాలు అంచనాలను మించి ఆడేశాయి. ఐతే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మాత్రం థియేటర్లలో సందడి కనిపించట్లేదు. మీడియం రేంజ్ సినిమాలు కాకుండా చిన్న చిత్రాలతో ఈసారి ఇండస్ట్రీ రీస్టార్ట్ కావడంతో పెద్దగా హంగామా లేకపోయింది.

తొలి వారం రిలీజైన తిమ్మరసు, ఇష్క్ చిత్రాలకు ఆశించిన ఓపెనింగ్స్ రాలేదు. ఉన్నంతలో ‘తిమ్మరసు’కు టాక్ పర్వాలేదు. ‘ఇష్క్’ డిజాస్టర్ టాక్‌తో మొదలై వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ‘తిమ్మరసు’ ఓ మోస్తరు వసూళ్లతో ముందుకు సాగింది. కానీ ఫైనల్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు కొంచెం దూరంలోనే ఆగిపోయినట్లు కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్లో తీసినా.. టాక్ పాజిటివ్‌గానే ఉన్నా ఈ సినిమా పరిస్థితి ఇలా తయారైంది.

తిమ్మరసు, ఇష్క్‌తో పాటు రిలీజైన మిగతా సినిమాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక గత శుక్రవారం అరడజను సినిమాల దాకా రిలీజయ్యాయి. వీటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఒక్క ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మాత్రమే. దీనికి మంచి బజ్ వచ్చినా.. సినిమాలో విషయంలో లేకపోవడంతో సందడంతా వీకెండ్‌కే పరిమితం అయింది. దీంతో పాటుగా రిలీజైన మెరిసే మెరిసే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మ్యాడ్ లాంటి చిత్రాల గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఇవి ప్రేక్షకుల దృష్టిలోనే పడలేదు.

వారాంతం తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సహా అన్ని సినిమాల థియేటర్లూ ఖాళీగా కనిపిస్తున్నాయి. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా కష్టమైన పరిస్థితి. ఈ వారాంతంలో కూడా అరడజను సినిమాల దాకా రిలీజవుతున్నాయి కానీ.. వాటిలో ‘పాగల్’ ఒకదానికే క్రేజ్ కనిపిస్తోంది. ఇదైనా టాలీవుడ్ కోరుకుంటున్న ఊపును తీసుకొస్తుందేమో చూడాలి.