జగన్ చేస్తున్న తప్పులు.. పవన్ చేస్తున్న ఒప్పులు చెప్పేసిన ఉండవల్లి

ఏపీ రాజకీయాల్లో కాస్త డొక్క శుద్ది ఉన్న కొద్దిమంది నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరుగా చెప్పాలి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ఓపెన్ గా మాట్లాడేయటంలో ఆయనకున్న టాలెంట్ మరెవరికీ లేదనే చెప్పాలి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆయన వాగ్దాటి అంతా ఇంతా కాద. అంతేకాదు.. విషయాల మీద అవగాహన కూడా ఎక్కువే. అలాంటి ఆయన తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. విపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయ పరిణామాలు.. సీఎం హోదాలో జగన్ చేస్తున్న తప్పులు.. పవన్ కల్యాణ్ చేస్తున్న ఒప్పుల్ని ఆయన ఓపెన్ గా చెప్పేశారు.

ఉండవల్లి ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

  • ఏపీలో టీడీపీ నేతల అరెస్టులు సరికాదు. ఎవర్ని అరెస్ట్ చేస్తే వారు లీడర్ అవుతారు. జగన్ అరెస్ట్ కాకపోతే సీఎం అయ్యేవాళ్లు కాదు. నేతల్ని ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నారో అర్ధం కావడం లేదు. అరెస్ట్ అయిన వారందరు ఎన్నికల్లో నెగ్గుతారు.
  • నేతలంతా పబ్లిక్‌కు సంబంధించిన గొడవల విషయంలో అరెస్ట్ అవుతున్నారు. ఒకర్ని అరెస్ట్ చేయడం అంటే అతడ్ని ఎలివేట్ చేయడమే. జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేస్తారని అనుకోవడం లేదు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఏవీ నిలబడలేవు. ఆయన మీద కేసులు ఉన్నాయని చెబుతున్నారు కానీ ఏవీ లేవు. ‘ఓటుకు నోటు కేసు ఏదో ఒకటి ఉన్నట్లుంది.. ఒక మనిషిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమంటే హీరోను చేయడమే’
  • ఉచిత పథకాలు 2024 ఎన్నికల వరకు ఇవ్వగలిగితే మళ్లీ జగన్ గెలుస్తారు. అందులో అనుమానం లేదు. కరోనా కల్లోలం నుంచి బయటపడాలంటే ప్రజల అకౌంట్‌లో డబ్బులు వేయాలని చాలామంది నిపుణులు చెప్పారు. ఆ డబ్బు మార్కెట్‌లోకి వస్తుంది. రోటేషన్ జరిగితే జీడీపీ ఉంటుంది.
  • కారణాలు వేరైనా నవరత్నాలతో అందరి అకౌంట్‌లలో డబ్బులు వేశారు. ఎప్పుడూ అలా చేయాలంటే అసాధ్యం. ఏడాదిన్నరలో లక్ష కోట్లు డబ్బులు అకౌంట్‌లో వేశానని జగన్ అన్నారు. ఎన్నాళ్లు ఇలా రన్ చేస్తారు? ఇప్పటికే ఇబ్బందులు మొదలయ్యాయి.
  • ఏపీలో జీతాలు ఆలస్యమవుతున్నాయి, ఆస్తులు అమ్ముతున్నారు డబ్బులు ఇస్తే మంచిది కానీ ఎలా ఇస్తున్నారన్నది చూడాలి. ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది, ఇక ఇబ్బందులు తప్పవు. దేశంలో కూడా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.
  • కరోనా జగన్‌కు వరం.. మోదీకి శాపం. కరోనా సమయంలో నవరత్నాలతో జగన్ ఇమేజ్ పెరిగింది. ప్రధాని మోదీ ఇమేజ్ తగ్గింది, అంతా అయిపోయిందని సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఉచిత పథకాలు ఇస్తున్నంత కాలం జగన్‌కు బావుంటుంది. ఏపీలో పేదవాళ్లకు పథకాలు బాగా అందుతున్నాయి. ఉచిత పథకాలు ఇవ్వగలిగినంత కాలం ఇబ్బంది లేదు.
  • ఏపీలో జగన్, చంద్రబాబు మధ్య పోటీ ఉంటుంది. జనసేన భవిష్యత్ ఎలా ఉంటుందన్నది చూడాలి. గత ఎన్నికల్లో వచ్చిన ప్రజా తీర్పుతో ఎవరైనా సరే రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వెంటనే ప్రజల్లోకి వచ్చారు. పట్టుదలతో ఉన్నారు.. ఇది గ్రేట్ క్వాలిటీ.
  • పవన్ ను నేనిలా ఊహించలేదు.ఓ రాజకీయ నేత స్పోర్టివ్‌గా తీసుకుని వచ్చి వెంటనే పారిపోలేదు. ఫీల్డ్ లో ఉన్నాను.. వస్తూనే ఉంటాననే మెసేజ్ పంపుతున్నారు. ప్రస్తుతం సినిమాలు తీసుకుని మధ్యలో డబ్బులు సంపాదించుకుంటానని క్లియర్‌గా చెప్పారు. పవన్ కళ్యాణ్ కరెక్ట్‌గా వెళితే మంచిదే. బీజేపీతో కలిసినా ప్రజలు పవన్‌ను మాత్రమే చూస్తారు. సినిమా ఫెయిలైతే ఎలా ఉంటుందో.. మరో సినిమా హిట్ కొడుతుందిలే అని జనసేనాని వచ్చారు. రాజకీయాల్లో ఇదో మంచి లక్షణం.
  • తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం చాలా ముఖ్యమైంది. ఫజల్ అలీ కమిషన్ కూడా రెండు రాష్ట్రాల మధ్య గొడవలు వస్తాయని చెప్పిందని.. గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తెలంగాణ కంటే నీటి సమస్య రాయలసీమలో దారుణంగా ఉందని.. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు చెప్పలేం. ఏం మాట్లాడితే జనాలు తమతో ఉంటారని భావిస్తే నాయకులు అదే మాట్లాడతారు. ప్రజలకు ఆకట్టుకోవడం కోసం ఏదేదో చెబుతారు.
  • ఎన్నికల తర్వాత ఇద్దరి సీఎంల మధ్య సఖ్యత ఉంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు సెటిల్ అవుతాయనుకున్నా.. కానీ రెండున్నరేళ్లుగా ఏం జరగలేదు. తెలంగాణలో ఉన్న ఆస్తుల విషయం కూడా ఏమీ మాట్లాడలేదు. కేసీఆర్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతారు.. చాలా ఆలోచించి మాట్లాడతారు.. ఆంధ్రాలో ఎవరూ అలా మాట్లాడలేరు. రాజకీయం అంటే మాటలు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు.