బీజేపీనే అసలైన ప్రతిపక్షమా ?

ప్రకటనలు చేయటంలో కమలనాదులకు మించిన వారు లేరన్నట్లుగా తయారైంది. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవటానికి బీజేపీనే అసలైన ప్రతిపక్షంగా తయారైందని ఆపార్టీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలమెంత ? ప్రజా ప్రతినిధులెంతమంది ? అన్న విషయాలు పరిశీలిస్తే చాలు జీవీఎల్ ప్రకటనలోని డొల్లతనం బయటపడుతుంది. ప్రస్తుతం బీజేపీ తరపున ఏకైక ఎంఎల్సీగా మాధవ్ ఉన్నారంతే.

ఏరోజు కూడా ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నేతలు క్షేత్రస్ధాయిలో పోరాటాలు చేసింది లేదు. ఎక్కడ ధర్నా అని పిలుపిచ్చినా పట్టుమని పదిమంది కూడా కనబడరు. అయితే మీడియా సమావేశాల్లో మాత్రం రెగ్యులర్ గా కనబడుతుంటారు. టీవీ డిబేట్లలోను, మీడియా సమావేశాల్లో మాత్రమే నేతల తమ వాణిని వినిపిస్తుంటారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదన్నది వాస్తవం.

నియోజకవర్గాల్లో పోటీకే అభ్యర్ధులు దొరకనిపార్టీ అధికార వైసీపీకి అసలైన ప్రతిపక్షమని కమలనాదులు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందికాబట్టే రాష్ట్రంలో ఈ మాత్రమైనా నేతలు మీడియా సమావేశాల్లో కనబడుతున్నారు. లేకపోతే ఇక్కడ కూడా కనబడరని అందరికీ తెలిసిందే. గడచిన రెండేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కొన్ని వందలసార్లు ఆరోపణలు, విమర్శలు చేసుంటారు.

ఇదే సమయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపిచ్చారు. అయితే వాటిలో ఒక్కపిలుపు కూడా సక్సెస్ కాలేదు. కారణం ఏమిటంటే ఆందోళనలను సక్సెస్ చేయటానికి రాష్ట్రవ్యాప్తంగా తగిన యంత్రాంగం లేకపోవటమే. పోనీ మిత్రపక్షం జనసేనను కలుపుకుని వెళుతున్నారా అంటే అదీలేదు. పేరుకు మాత్రమే మిత్రపక్షాలైనా అంతర్గతంగా రెండుపార్టీల మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. రేపటి ఎన్నికల్లో కూడా పోయిన ఎన్నికల సీనే రిపీటవుతుందనటంలో సందేహమేలేదు. అలాంటి బీజేపీనే అసలైన ప్రతిపక్షమని చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.