మోడీపై పైసా దెబ్బ !

మోడీపై పైసా దెబ్బ !

వ‌స్తువ ఏదైనా ధ‌ర పెరిగితే వినియోగ‌దారుల‌కు కోపం వ‌స్తుంది. అదే టైంలో ధ‌ర త‌గ్గితే సంతోష‌ప‌డిపోతారు. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఆగ్ర‌హం అనుగ్ర‌హంగా మారుతుంది. కానీ.. చిత్రంగా త‌గ్గింపు ధ‌ర‌లు అశేష భార‌తావ‌నిని ఆగ్ర‌హంతో చిందులు తొక్కేలా చేసింది. ధ‌ర త‌గ్గించి మ‌మ్మ‌ల్ని అవ‌మానిస్తావా? అంటూ సూటిగా మోడీ స‌ర్కారును ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి. ఇప్పుడు చెప్పేదంత ఎవ‌రి గురించ‌న్న‌ది మీకు ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది. అవును.. పెట్రోల్‌.. డీజిల్ పై లీట‌రుకు పైసా త‌గ్గిస్తూ చ‌మురు కంపెనీలు తీసుకున్న నిర్ణ‌యంపై దేశ ప్ర‌జ‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

నిజానికి లీట‌రు పెట్రోల్.. డీజిల్ మీద రెండేసి రూపాయిలు చొప్పున పెంచినా కూడా ఇంత ఆగ్ర‌హం ఉండ‌దేమో. త‌గ్గించి త‌ప్పు చేశామ‌న్న‌ట్లుగా ప్ర‌జ‌ల తీరు ఉంద‌ని చెప్పాలి. గ‌డిచిన ప‌ద‌హారు రోజులుగా నాన్ స్టాప్ గా పెరుగుతున్న పెట్రో ధ‌ర‌ల్లో పైసా త‌గ్గిస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై మూకుమ్మ‌డిగా మండిప‌డుతున్నారు. ఎట‌కారంగా ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. పెంచేట‌ప్పుడు రూపాయిల్లో పెంచేసి.. త‌గ్గించేట‌ప్పుడు పైసా త‌గ్గిస్తారా?.. మీ పైసా త‌గ్గింపు మాకేమి అక్క‌ర్లేదు.. బోడి త‌గ్గింపు అంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

పైసా త‌గ్గింపును పైసాచికంగా అభివ‌ర్ణిస్తున్న వారు లేక‌పోలేదు. అంతేనా.. ఇటీవ‌ల కాలంలో పెంచిన ధ‌ర‌ల‌తో ల‌క్ష‌లాది కోట్ల రూపాయిల్ని దేశ ప్ర‌జ‌ల నుంచి పిండేస్తున్న మోడీ స‌ర్కారు.. జ‌నాల‌కు తిరిగి ఇచ్చేట‌ప్పుడు పైసా ఇస్తారా? ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌జ‌లేం చేస్తార‌న్న ధీమానా? అంటూ ఫైర్ అవుతున్నారు.

పైసా త‌గ్గింపు జ‌నాగ్ర‌హానికి నిద‌ర్శ‌నంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు క‌నిపిస్తున్నాయి. పైసా త‌గ్గింపుతో ప్ర‌భుత్వం త‌మ‌ను ఎట‌కారం చేస్తోంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. దీనికి త‌గ్గ‌ట్లే సోష‌ల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. త‌మ ఆగ్ర‌హాన్ని ఓపెన్ గా వ్య‌క్తం చేస్తున్నారు.  
పైసా త‌గ్గింపు సోష‌ల్ మీడియాలో ఎంత‌టి ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతుంద‌న్న‌ది చూస్తే..

+  పెట్రోల్‌, డీజిల్‌పై ఆదా చేసిన ఒక్క పైసాతో ఇల్లు, కారు, హెలికాప్టర్‌ కొనాలనుకుంటున్నాను.

+  ఒక్క పైసా ఆదా అయింది. ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు. ఏమేం కొనాలో ఒక జాబితా రూపొందించుకోవాలి.

+  సేల్‌ సేల్‌.. మెగా సేల్‌.. పెట్రోల్‌పై  పైసా డిస్కౌంట్‌. త్వరపడండి.. ట్యాంకు ఫుల్‌ చేయించండి.. మంచి తరుణం మించినా దొరకదు.

+  అబ్బా! ఎంత ఉపశమనమో. ఒక్క పైసా తగ్గిందోచ్‌.. నిజంగా ఇవాళ నేను కోటీశ్వరుడినన్న భావన కలుగుతోంది.

+  ఒక్క పైసాను ఏం చేసుకోవాలబ్బా... ఆ...గుర్తొచ్చింది.  జన్‌ధన్‌ యోజన అకౌంట్లలో జమచేసేస్తాను

+  వావ్‌.. ఊహించలేకపోతున్నాం. ఏకంగా ఒక్క పైసా తగ్గించారు.ప్రజలపై మోడీకి ఉన్న సానుభూతిని వెలకట్టలేం... నిజంగా మీ రుణం తీర్చుకోలేనిది.

+  పట్టలేనంత సంతోషంగా ఉంది. నా అందమైన భవిష్యత్‌ని నిర్మించుకోవడానికి ఒక్క పైసా ఆదా చేసుకోగలిగాను. ఇంతకంటే జీవితానికి కావల్సినదేముంది.

+  అసలు దీనంతటికీ కారణం తొలి ప్రధాని నెహ్రూయే. ఆయన హయాంలోనే పైసాను చలామణిలోకి తెచ్చారు. అందుకే ఇప్పుడు పైసా తగ్గింది

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు