కక్కుర్తి కొంప ముంచుతోంది.. ధనుష్ కు చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు

రీల్ స్టార్లుగా వెలిగిపోతుంటారు. ఉదాత్తమైన పాత్రలతో కోట్లాది మంది మనసుల్ని దోచేసే వెండితెర నటులు.. సినిమాలో మాదిరి వారి ఆలోచనలు ఉన్నతంగా ఉండవా? చాలామంది మాదిరి వారిలోనూ కనిపించే కక్కుర్తికి షాక్ తినాల్సిందే. కోట్లాది రూపాయిల్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నప్పుడు.. కాస్తంత పన్నును కట్టేస్తే పోయేదేముంది? కానీ.. ఎక్కడ లేని కక్కుర్తిని ప్రదర్శించి.. రాయితీ కోసం కోర్టుల్ని ఆశ్రయించుకొని చీవాట్లు పెట్టించుకునే వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ నటుడు.. సందేశాత్మక చిత్రాలతో తరచూ తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకునే ప్రముఖ హీరో విజయ్. ఒక సినిమాకు అతగాడు ఛార్జి చేసే మొత్తం భారీగా ఉంటుంది. అలాంటి విజయ్.. తన రియల్ లైఫ్ లో ఖరీదైన కారు కొనుగోలు చేశారు. దానికి చెల్లించాల్సిన ట్యాక్సు విషయంలో మాత్రం.. మరీ ఇంత పన్ను ఎందుకు చెల్లించటం అనుకొని..కోర్టును ఆశ్రయించారు. తనకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం చావు తిట్లు తిట్టటమే కాదు. అతడి మాటలకు రూ.లక్షను ఫైన్ గా వేసింది. ఈ ఉదంతంలో ఈ మధ్యన సంచలనంగా మారింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్న తర్వాత అయినా మిగిలిన వారిలో మార్పులు రావాలి కదా? అలాంటిదేమీ లేకుండా వ్యవహరించిన తీరుతో.. తాజాగా మద్రాస్ హైకోర్టులో చావు తిట్లు తిన్నాడు మరో తమిళ స్టార్ నటుడు ధనుష్. ఆ మధ్యన లగ్జరీ కారు (2015లోరోల్స్ రాయిస్ కారు)ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన చెల్లించాల్సిన పన్ను రేటు భారీగా ఉందన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేసి.. తగిన రీతిలో తగ్గించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అదే సంవత్సరం కోర్టును ఆశ్రయించారు.

తాజాగా జరిపిన విచారణలో ధనుష్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది మద్రాస్ హైకోర్టు. ఒకవైపు లగ్జరీ కారును కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. దీనికి స్పందించిన ధనుష్ తరఫున న్యాయవాది.. ధనుష్ ఇప్పటికే 50 శాతం పన్ను చెల్లించారని తెలిపారు. దీంతో కాస్త శాంతించిన కోర్టు.. మిగిలిన పన్ను మొత్తాన్ని వెంటనే చెల్లించాలన్నారు. విలాసవంతమైన కారును కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతారు? అంటూ సూటి ప్రశ్నను సంధించింది. సామాన్యులే పన్ను కడుతున్నప్పుడు సెలబ్రిటీలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది.

హైకోర్టు ఆగ్రహాన్ని గుర్తించిన ధనుష్ తరఫు న్యాయవాది ఆగస్టు 9లోపు పన్ను మొత్తాన్ని చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. కక్కుర్తి పడటం ఎందుకు.. ఇలా చివాట్లుతినటం ఎందుకు? కోర్టు ఫీజు.. లాయర్ ఫీజులు చెల్లించి.. తిట్లు తినే కంటే.. ఎంచక్కా పన్నుకట్టేస్తే సరిపోయేది కదా? రీల్ లో ఇంటెలిజెంట్ గా వ్యవహరించే హీరోలు.. రియల్ లైఫ్ లో అంత చిల్లరగా ఎలా ఆలోచిస్తారన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతుండటం గమనార్హం.