బంగార్రాజు.. కింకర్తవ్యం?


అక్కినేని నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సిక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమా తీయాలని ఐదేళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అవి ఎంతకీ ఒక కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు స్క్రిప్టు లాక్ చేశారని.. ఈ నెల 20న షూటింగ్ కూడా మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ సినిమాను మొదలుపెట్టే దిశగా వార్తలు వచ్చినపుడల్లా సంక్రాంతి అనే మాటే వినిపిస్తోంది. ‘సోగ్గాడే..’ సంక్రాంతికి రావడం వల్లే అనుకున్నదానికంటే పెద్ద విజయం సాధించిందన్నది స్పష్టం. ఆ టైంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చూడ్డానికి ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు.

అది గుర్తించే నాగ్.. ప్రేక్షకులకు బాగా నచ్చిన ‘బంగార్రాజు’ క్యారెక్టర్‌తో కొత్త సినిమా పూర్తి చేస్తే సంక్రాంతికే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ మధ్య కూడా ‘బంగార్రాజు’ గురించి మాట్లాడుతూ సంక్రాంతికి రిలీజ్ చేసే ఉద్దేశాన్ని బయటపెట్టారు. ఐతే ఆయన ఆ మాట అన్నప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు.

ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు 2022 సంక్రాంతి పోటీ బాగా ఎక్కువైపోయింది. ఆల్రెడీ ‘సర్కారు వారి పాట’, ‘రాధేశ్యామ్’, ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ల సంక్రాంతి రిలీజ్ ఖరారైపోయింది. వాటికి డేట్లు కూడా ఇచ్చేశారు. ఇప్పటికే పోటీ ఎక్కువైపోయింది, థియేటర్ల సర్దుబాటు చాలా కష్టం అని అంటున్నారు. వీటిలో ఒకటి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చంటున్నారు. మరోవైపేమో ‘ఎఫ్-3’ లాంటి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతి మీద కన్నేసినట్లు తెలుస్తోంది.

ఇంత పోటీ ఉండగా.. ఇక ‘బంగార్రాజు’కు ఎక్కడ స్కోప్ ఉంది? మరి నాగ్ ఏమో సంక్రాంతి టార్గెట్‌తో సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. మరి రిలీజ్ విషయంలో నాగ్ ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరం. ఆయన సంక్రాంతి రిలీజ్ విషయంలో మరీ పట్టుదలకు పోకుండా వేరే సీజన్, కుదిరితే 2022 వేసవిని టార్గెట్ చేస్తే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.