ఎంఎల్ఏల రాజీనామాలకు డిమాండ్లు

గతంలో ఎప్పుడు లేనట్లుగా ప్రజలు తమ ఎంఎల్ఏల రాజీనామాలకు డిమాండ్లు చేస్తున్నారు. ఎంఎల్ఏలు రాజీనామాలు చేస్తేకానీ తమ నియోజకవర్గాల్లో అభివృద్ది సాధ్యంకాదని తమకు అర్ధమైపోయిందని జనాలు డిమాండ్లు మొదలుపెట్టారు. ఇలాంటి డిమాండ్లు ముందుగా ఖమ్మం జిల్లాలో బాగా ఊపందుకుంది. ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ప్రధానంగా ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎంఎల్ఏలకే ఇలాంటి రాజీనామాల సెగ బాగా తగులుతోంది.

మామూలుగా అయితే ఒకసారి ఎన్నికలైపోయిన తర్వాత జనాలు ఎంఎల్ఏ గురించి పట్టించుకునేది ఉండదు. కానీ ఇపుడు రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నారంటే దీనికి ఓ కారణముంది. అదేమిటంటే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా కేసీయార్ చేసిన వ్యాఖ్యలే కారణం. ఎప్పుడు జరుగుతుందో తెలీని ఉపఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా కేసీయార్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న టార్గెట్ తో నియోజకవర్గంలో రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, వివిద పథకాలను అమలు చేస్తున్నారు. అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ అందిస్తున్నారు. గతంలో ఎప్పుడూ జరగనంతగా నియోజకవర్గంలో అభివృద్దిపనులు జరుగుతున్నాయి. ఇదే విషయమై కేసీయార్ మాట్లాడుతు ఉపఎన్నికలో గెలవటం కోసం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను స్పీడుగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

చివరకు దళితబంధు పథకం కూడా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. కేసీయార్ చేసిన ఈ ప్రకటనే ఇపుడు ఎంఎల్ఏల మెడకు చుట్టుకున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జనాలందరు చూస్తున్నారు. దాంతో ఉపఎన్నికలు వస్తేకానీ తమ నియోజకవర్గాలు డెవలప్ కాదని జనాలు తీర్మానించుకున్నారు. అందుకనే తమ ఎంఎల్ఏల రాజీనామాలకు డిమాండ్లు మొదలుపెట్టారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, పాలేరు, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎంఎల్ఏలుగా గెలిచారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునేపేరిట వీరంతా టీఆర్ఎస్ లో చేరారు. అయితే వీళ్ళు టీఆర్ఎస్ లో చేరి రెండున్నర సంవత్సరాలైనా ఇంతవరకు జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేదని జనాలు భావిస్తున్నారు.

అభివృద్ధి కార్యక్రమాల అమలులో జనాలు తమ నియోజకవర్గాలను హుజూరాబాద్ ను పోల్చి చూసుకంటున్నారు. దాంతో తమ నియోజకవర్గాలు డెవలప్ కావాలంటే హుజూరాబాద్ లో వచ్చినట్లే ఉపఎన్నికలు వస్తేకానీ సాద్యంకాదని జనాలు డిసైడ్ అయ్యారు. దాంతో వెంటనే తమ ఎంఎల్ఏలను రాజీనామాలు చేయాలంటు డిమాండ్లు మొదలుపెట్టారు. ఒకవేళ ఇప్పటి డిమాండ్లు ముందు ముందు ఉద్యమంగా మారితే మాత్రం ఎంఎల్ఏలందరికీ రాజీనామాల సెగ తప్పేట్లు లేదు. మరపుడు కేసీయార్ ఏమి చేస్తారో చూడాలి.