వ్యూహ‌మిదే: కొన్నేళ్లు క‌ర్ణాట‌క సీఎం య‌డ్డీనే

వ్యూహ‌మిదే:  కొన్నేళ్లు క‌ర్ణాట‌క సీఎం య‌డ్డీనే

అంచ‌నాలు వ‌మ్ము కాలేదు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మెజార్టీ లేకున్నా.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించిన క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న నిర్ణ‌యాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్న ప‌రిస్థితి. కాంగ్రెస్‌.. జేడీఎస్ లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నా.. అవేమీ ప‌ట్ట‌న‌ట్లుగా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసేసి ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చున్నారు య‌డ్యూర‌ప్ప‌.

య‌డ్డీ స‌ర్కారు బ‌లాన్ని నిరూపించుకునేందుకు 15 రోజుల గ‌డువును ఇచ్చారు గ‌వ‌ర్న‌ర్. మ‌రి.. ఈ 15 రోజుల్లో  య‌డ్డీ ఏం చేస్తారు?  ప్ర‌భుత్వానికి బ‌లం ఉన్న‌ట్లు ఎలా నిరూపిస్తారు? అన్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి.  ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 15 రోజులు ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్‌.. ఆ లోపు య‌డ్డీ త‌న బ‌లాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.

లెక్క‌ల్లోని చిన్న వెసులుబాటుతో 15 రోజుల గండాన్ని య‌డ్యూర‌ప్ప సింఫుల్ గా అధిగ‌మిస్తార‌ని చెబుతున్నారు. అదెలానంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌కారం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి 8 మంది ఎమ్మెల్యేల త‌క్కువ‌గా బీజేపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. కాంగ్రెస్.. జేడీఎస్ కు 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసిన జేడీఎస్ నేత కుమార‌స్వామి ఒక‌చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే.. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన స్థానాల సంఖ్య 221కు త‌గ్గిపోతుంది. మేజిక్ నెంబ‌రు సైతం 111కు మారుతుంది. బ‌ల‌నిరూప‌ణ స‌మ‌యంలో కాంగ్రెస్ కానీ.. జేడీఎస్ ఎమ్మెల్యేలు కానీ గైర్హాజ‌రు అయ్యేలా చూస్తే య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వం విశ్వాస ప‌రీక్ష‌లో సింఫుల్ గా నెగ్గుతుంది. ఇప్ప‌టికైతే 15 రోజుల గండాన్ని సులువుగా దాటేయొచ్చ‌ని.. మ‌రో ఆర్నెల్ల వ‌ర‌కూ య‌డ్డీ స‌ర్కారుకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌ర‌గ‌ని రెండు స్థానాలు.. కుమార‌స్వామి ఒక స్థానాన్ని ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుచుకుంటే.. ఆ పార్టీ బ‌లం 107కు పెరుగుతుంది. ఆ లోపు రెండు విప‌క్ష పార్టీల్లో ఏదో ఒక‌దాన్ని చీలిస్తే..క‌ర్ణాట‌క‌లో య‌డ్డీ ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవ‌కాశ‌మే ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు