ఉదయం బీజేపీలో.. సాయంత్రం కాంగ్రెస్‌లో..

ఉదయం బీజేపీలో.. సాయంత్రం కాంగ్రెస్‌లో..

క‌న్న‌డ రాజకీయం ర‌స‌కందాయంలో ప‌డుతోంది. అనూహ్య‌ రీతిలో సుప్రీంకోర్టు ఆదేశాల‌తో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప గురువారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఈ పరిణామంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే అదే స‌మ‌యంలో కర్ణాట‌క‌లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎర వేస్తోంది. ఇలా.. ఓ ఎమ్మెల్యే బీజేపీకి చిక్కినట్టే చిక్కి.. చేజారిపోయారు. దీంతో అవాక్క‌వ‌డం బీజేపీ వంత‌యింది.

మాజీ సీఎం సిద్ధరామయ్యకు అనుచురడైన శంకర్ అనే ఎమ్మెల్యే ఈ ట్విస్ట్ ఇచ్చారు. బుధ‌వారం ఉదయం బీజేపీ పంచన చేరిన ఆర్‌.శంకర్‌ అనే ఎమ్మెల్యే సాయంత్రానికి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో రణబన్నూరు టికెట్‌ను శంక‌ర్‌ ఆశించారు. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని బీజేపీ ఆఫర్‌ ఇచ్చినా.. కాదని ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గెలుపోందారు. అయితే ఎమ్మెల్యేల వేట‌లో ఉన్న బీజేపీ ఆయ‌న్ను మద్దతివ్వాలని కోరింది. దీనికి ఓకే చెప్పేసిన శంకర్‌.. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌కు జై కొట్టారు. దీంతో బీజేపీ నేత‌లు అవాక్క‌య్యారు.

ఇదిలాఉండ‌గా...రాష్ట్రంలో రిసార్టు రాజకీయాలు ఊపందుకున్నాయి. తమ ఎమ్మెల్యేలు గోడదూకి ఇతర పార్టీల్లో చేరకుండా కాంగ్రెస్, జేడీ(ఎస్) చర్యలు చేపడుతున్నాయి. కాంగ్రెస్ కనకపుర ఎమ్మెల్యే డీకే శివకుమార్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను రామనగర జిల్లా బీదడిలోని ఈగల్టన్ రిసార్టుకు తరలించారు. అనూహ్యంగా అక్కడ ప్రత్యక్షమైన ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మరోవైపు జేడీ (ఎస్) తమ ఎమ్మెల్యేలను ఓ అంతర్జాతీయ హోటల్‌కు తరలించింది.

మ‌రోవైపు స్పష్టమైన మెజారిటీ లేకున్నా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తిమ్మినిబమ్మి చేసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బీజేపీ లక్ష్యం ముందు ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటూ ట్వీట్‌ చేశారు. 'ఇవాళ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటారు..సంతోషంగా ఉంటారు.. కానీ.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందని దేశం విచారం వ్యక్తం చేస్తుంది' అని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు