సిద్ధ‌రామ‌య్యకు "డ‌బుల్" షాక్..!

సిద్ధ‌రామ‌య్యకు

ముఖ్య‌మంత్రి హోదాలో ఎన్నిక‌ల బ‌రిలో దిగితే ఫ‌లితం ఎలా ఉంటుంది? క‌చ్ఛితంగా క‌ర్ణాట‌క సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సిద్ధ‌రామ‌య్య‌కు ఎదురైన ప‌రిస్థితి మాత్రం ఉండ‌దు. సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న రెండు స్థానాల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడే ఆయ‌న‌లో గెలుపు భ‌యం ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మైన ప‌రిస్థితి.

దీనికి త‌గ్గ‌ట్లే ప్ర‌జ‌ల తీర్పు కూడా అదే రీతిలో ఉంద‌ని చెప్పాలి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో సీఎం సిద్ద‌రామ‌య్య చాముండేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. బాదామి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బ‌రిలోకి దిగారు. ఆయ‌న రెండు చోట్ల ఓట‌మి త‌ప్ప‌దంటూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు పెద్ద ఎత్తున  ప్ర‌చారం చేశారు.అయితే.. వారి మాటలు స‌గ‌మే నిజమ‌య్యాయి.

సిద్ద పోటీ చేసిన చాముండేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. బాదామిలో ఆయ‌న ఊర‌ట నిచ్చేలా ఉంది. అయితే.. ఇక్క‌డ కూడా స్వ‌ల్ప అధిక్య‌త‌తో మాత్ర‌మే ఆయ‌న గెలిచే వీలుంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఓట్ల లెక్కింపు షురూ అయిన త‌ర్వాత సిద్ద‌రామ‌య్య రెండు స్థానాల్లోనూ వెన‌కంజ‌లో ఉండ‌టంతో కాంగ్రెస్ వ‌ర్గాల‌కు షాకింగ్ గా మారాయి. త‌ర్వాత రౌండ్ల‌లో పుంజుకున్న ఆయ‌న రెండు చోట్ల అధిక్య‌త‌లోకి వ‌చ్చారు. అయితే.. కాసేప‌టికే చాముండేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మిపాలు కాగా.. బాదామిలో అతి త‌క్కువ అధిక్య‌త‌లో ఉన్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సిద్ద‌రామ‌య్య కుమారుడు య‌తీంద్ర తాను బ‌రిలో దిగిన వ‌రుణ నియోజ‌క‌వ‌ర్గంలో అధిక్య‌త‌లో కొన‌సాగుతున్నారు. విజ‌యం సాధించ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

సిద్ద‌రామ‌య్య‌కు తాజా ఓట‌మి మ‌హా ఇబ్బందిక‌రంగా మారిందని చెప్పాలి. త‌న‌కు ఇదే చివ‌రి ఎన్నిక‌ల‌ని.. తాను గెలిచినా.. ఓడినా త‌ర్వాతి ఎన్నిక‌ల నుంచి బ‌రిలోకి దిగ‌న‌ని చెప్ప‌టం ద్వారా.. ఈసారి త‌న కోసం కాంగ్రెస్ కు ఓట్లు వేయాల‌న్న అభ్య‌ర్థ‌న సిద్ద‌రామ‌య్య నుంచి వ‌చ్చింది. అయితే.. ప్ర‌జ‌లు ఆయ‌న మాట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లుగా లేదు. రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఒక చోటు స్వ‌యంగా ఓడిపోవ‌టం ఒక బాధ అయితే.. పార్టీకి గెలుపు చాలా అవ‌స‌ర‌మైన వేళ‌.. దాన్ని అందించ‌కుండా సిద్ద‌రామ‌య్య డ‌బుల్ ఫెయిల్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు