వివాదంలో గ‌వ‌ర్న‌ర్‌..జ‌ర్న‌లిస్టుతో ఇబ్బందిక‌ర ప్ర‌వ‌ర్త‌న‌

వివాదంలో గ‌వ‌ర్న‌ర్‌..జ‌ర్న‌లిస్టుతో ఇబ్బందిక‌ర ప్ర‌వ‌ర్త‌న‌

ఇటీవ‌లి కాలంలో త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తున్న త‌మిళనాడులో మ‌రో అనూహ్య ప‌రిణామం జ‌రిగింది. తమిళనాడు గవర్నర్ భ‌న్వ‌రిలాల్‌ పురోహిత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మహిళా పాత్రికేయురాలు లక్ష్మీ సుబ్రమణియన్‌తో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ద వీక్ పత్రిక జర్నలిస్టు లక్ష్మీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ ఆమె చెంపను తట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ పురోహిత్ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు వస్తున్నాయి.

తమిళనాడులో ఇటీవల సంచలనం రేపిన ప్రొఫెసర్ నిర్మలా దేవి అంశంపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ప్రొఫెసర్ నిర్మలాదేవి ఓ కాలేజీకి చెందిన నలుగురు అమ్మాయిలను సెక్స్‌వర్క్‌లుగా మార్చేందుకు ప్రయత్నించింది. ఆ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. ఆ వివాదాస్పద ప్రొఫెసర్‌కు గవర్నర్ పురోహిత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయని కొన్ని మీడియా సంస్థ‌ల్లో క‌థ‌నాలు వచ్చాయి. ఈ నేప‌థ్యంలో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసిన గ‌వ‌ర్న‌ర్  తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. చాలా ఆగ్రహంగా ఆయన సమాధానాలు ఇచ్చారు. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసే సమయంలో జర్నలిస్టు లక్ష్మీ ఓ ప్రశ్న వేసింది. ప్రభుత్వ పర్ఫార్మెన్స్‌తో సంతృప్తికరంగా ఉన్నట్లు మీరు తెలిపారు కాదా, మరి రాష్ట్రంలోని వర్సిటీల పనితీరు బాగుందని మీరు భావిస్తున్నారా అని ఆమె అడిగారు. ఆ సమయంలో కూర్చీలోంచి లేచిపోతూ.. గవర్నర్ పురోహిత్ ఆ జర్నలిస్టు బుగ్గను తట్టారు. దీంతో ఒక్క‌సారిగా అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

గ‌వ‌ర్న‌ర్ తీరుతో జర్నలిస్టు లక్ష్మీ కొంతసేపు నిర్ఘాంతపోయారు. వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి ఆ స్థితి నుంచి కోలుకునే ప్రయత్నం చేశారు. అనంత‌రం స‌న్నిహితుల‌తో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ వ్యక్తి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా చెంపను తాకడం ఎంత వరకు సమంజసమని ఆ జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఓ మహిళను తాకడం అసభ్యమే అవుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.  దీనిపై గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు