మోడీ.. బాబు ఫోన్ కాల్ సంభాష‌ణ బ‌య‌ట‌కొచ్చేసింది

మోడీ.. బాబు ఫోన్ కాల్ సంభాష‌ణ బ‌య‌ట‌కొచ్చేసింది

మిత్ర ప‌క్షానికి చెందిన ఒక అధినేత ప్ర‌ధానితో మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నిస్తే ఫోన్ కాల్‌కు దూరంగా ఉంటారా? ఉండ‌నంటే ఉండ‌ర‌ని ఎవ‌రైనా చెబుతారు. ఒక‌వేళ కీల‌క‌స‌మావేశంలో ఉంటే కొద్ది గంట‌ల త‌ర్వాత లైన్లోకి వ‌స్తారు. కానీ.. ఇలాంటి వాటికి ప్ర‌ధాని మోడీ మిన‌హాయింపుగా చెప్పాలి. బుధ‌వారం రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ కోసం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫోన్లో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించారు.కానీ.. కుద‌ర్లేదు.

ప్ర‌ధాని ఓఎస్డీకి బాబు మాట్లాడ‌తార‌న్న విషయాన్ని చెప్ప‌గా.. తాను ప్ర‌ధాన‌మంత్రికి స‌మాచారాన్ని అందిస్తాన‌ని చెప్పారు. కానీ.. ఆ త‌ర్వాత ఫోన్ కాల్ వ‌చ్చింది లేదు. క‌ట్ చేస్తే.. గురువారం సాయంత్రం నాలుగు గంట‌ల వేళ‌లో ప్ర‌ధాని మోడీనే ఏపీ ముఖ్య‌మంత్రికి ఫోన్ చేయ‌టం గ‌మ‌నార్హం.

ఈ మ‌ధ్య స‌మ‌యంలో ఏపీ రాజకీయాల్లో చాలానే ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. హోదా సాధ‌న విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న విధానంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ త‌న ఇద్ద‌రు మంత్రుల్ని కేంద్ర కేబినెట్ నుంచి ఉప‌సంహ‌రించుకుంటున్న వేళ‌.. బాబుకు మోడీనే ఫోన్ చేయాల్సి వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య ప‌ది నిమిషాల‌పాటు మాట‌లు జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రికొన్ని మీడియా వ‌ర్గాలు మాత్రం వీరి సంభాష‌ణ 20 నిమిషాల పాటు సాగిన‌ట్లుగా వెల్ల‌డించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే. మోడీ.. బాబులు మాట్లాడుకున్న ఫోన్ సంభాష‌ణ‌.. ఇదేనంటూ తెలుగు మీడియా రంగానికి చెందిన ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ వెల్ల‌డించింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం అంటూ బ‌య‌ట‌పెట్టిన మోడీ.. బాబు సంభాష‌ణ‌ను స‌ద‌రు మీడియా సంస్థ వెల్ల‌డించిన అంశాన్ని చూసిన‌ప్పుడు..

ప్రధాని మోడీ: నాయుడూజీ ఎలా ఉన్నారు?
సీఎం బాబు: బాగున్నాను సర్‌.
 
మోడీ: బుధవారం రాత్రి నాకు బాగా ఆలస్యమైంది. అందుకే మీ ఫోన్‌కు ప్రతిస్పందించలేకపోయాను. గురువారం ఉదయమే రాజస్థాన్‌ వెళ్లడంతో మాట్లాడటం కుదరలేదు!

బాబు: ఓకే సర్‌.
 
మోడీ: మా మంత్రివర్గం నుంచి వైదొలగాలని మీరు తీసుకొన్న నిర్ణయం చూశాను. ఎందుకు తొందరపడుతున్నారు? మనం కూర్చుని మాట్లాడుకొందాం. సమస్యలు ఉంటానే ఉంటాయి. ఎన్ని వీలైతే అన్ని పరిష్కరించుకొందాం. మీరు ఢిల్లీ రండి!

బాబు: దానికి సమయం మించిపోయింది. మేం నాలుగేళ్లుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మిమ్మల్ని కూడా అనేకసార్లు కలిశాం. ఓపికగా ఎదురు చూశాం. ఆఖరి బడ్జెట్‌ వరకూ కూడా సహనంతోనే ఉన్నాం. కానీ, మీ ప్రతిస్పందన మాకు నిరాశ కలిగించింది. ప్రజల్లో కూడా ఇది భావోద్వేగానికి దారితీసింది. తప్పని పరిస్ధితుల్లో మా అసంతృప్తి వ్యక్తం చేయడానికి రాజీనామాల నిర్ణయం తీసుకొన్నాం. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు. మొత్తం ఎంపీలు, మా పార్టీ నేతలు, రాష్ట్ర ప్రజలందరి సమష్టి నిర్ణయం. అన్నీ ఆలోచించే తీసుకొన్నాం. మర్యాదపూర్వకంగా మీకు తెలియచేశాకే ప్రకటించాలనుకొన్నాం. మీరు అందుబాటులోకి రానందుకే ప్రకటించేశాం!
 
మోడీ: కొన్ని పరిష్కారం అయినట్లుగా నాకు అధికారులు సమాచారం అందించారు కదా!

బాబు: ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని గతంలో మాకు చెప్పారు. కానీ, ఆ ప్రయోజనాలు ఇటీవల కొన్ని రాష్ట్రాలకు పొడిగించారు. దానిని మాకూ వర్తింప చేయాలని కోరాం. కుదరదని చెప్పారు. పారిశ్రామిక రాయితీలు హోదా ఉన్న రాష్ట్రాలకు పొడిగించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీ ప్రకారం మాకూ ఇవ్వాలన్నాం. ఇవ్వలేమని చెప్పారు. హోదా బదులు రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఈ రోజు వరకూ మాకు పైసా అందలేదు. లోటు భర్తీ కింద చాలా రావాలి. కొద్దిగా తేల్చి అదే ఇస్తామంటున్నారు. రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఓడ రేవు... ఇలా ఏదీ తేల్చలేదు. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో మాకు పోటీ పెడుతున్నారు. పార్లమెంటులో విభజన చట్టం మిగిలిన రాష్ట్రాలకు తేలేదు కదా? ఇచ్చిన హామీల అమలు గురించే మేం అడుగుతున్నాం. వేరేవి అడగడం లేదు!
 
మోడీ: మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. కూర్చుని మాట్లాడుకుంటే ఫలితం వస్తుందన్నది నా విశ్వాసం. అందుకే, మరోసారి రమ్మంటున్నాను.

బాబు: చర్చలకు మేం వ్యతిరేకం కాదు. మా సమస్యలు పరిష్కరిస్తామంటే ఎందుకు వద్దంటాం? మేం మంత్రి పదవుల నుంచి మాత్రమే వైదొలిగాం. ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోలేదు. మిత్రపక్షంగానే ఉన్నాం. ఇప్పటికైనా మీరు చేయండి. మీ మేలు మర్చిపోలేం!
 
మోడీ: అన్నీ సవ్యంగా జరుగుతాయని అనుకుంటున్నాను!( ప్రధాని మోడీ తన సంభాషణ ముగించారు)

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు