అంతరిక్షంలోకి తెలుగు మహిళ..!

తొలిసారిగా అంతరిక్షంలోకి ఓ తెలుగు మహిళ అడుగుపెడుతోంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ మహిళకు అంతరిక్షంలోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహన నౌకను ప్రయోగించనుంది.

నలుగురు ప్రయాణికులు వెళ్తున్న ఈ వాహన నౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉండటం విశేషం. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యాక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు.

అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గాను వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేయనుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్ 25న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్స్ జారీ చేసింది. దీంతో ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్ ఫ్లైట్ బయలుదేరనుంది. వర్జిన్ గెలాక్టిక్ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. అయితే… ప్రయాణికులను తీసుకువెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.