నితిన్ లాట‌రీ కొట్టిన‌ట్లే


యువ క‌థానాయ‌కుడు నితిన్ కొత్త చిత్రం మాస్ట్రో థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ వాళ్లు కొనేశారు. డీల్ ముగిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఆగ‌స్టులో మాస్ట్రోకు ప్రిమియ‌ర్స్ ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు ఎంత రేటు ప‌లికింద‌న్న దానిపై అంద‌రూ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ మొత్తం రూ.32 కోట్ల‌ని స‌మాచారం. కొన్ని నెలల ముందు వ‌ర‌కు అయితే నితిన్ సినిమా మీద ఇంత రేటు పెట్ట‌డం క‌రెక్టే అనిపించొచ్చు. కానీ ఇప్పుడున్న అత‌డి మార్కెట్ ప్ర‌కారం చూస్తే ఈ రేటు ఎక్కువే.

ఎందుకంటే గ‌త ఏడాది భీష్మ‌తో పెద్ద హిట్టు కొట్టి ఊపు మీదున్న నితిన్.. కొత్త ఏడాదిలో చెక్, రంగ్ దె లాంటి ప‌రాజ‌యాలు ఎదుర్కొన్నాడు. దీంతో అత‌డి మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మాస్ట్రోను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే ఏమాత్రం ఆడుతుందో అన్న డౌట్లున్నాయి. ఎందుకంటే ఇది రీమేక్. పైగా థియేట‌ర్లు ఎప్ప‌టికి తెరుచుకుంటాయో.. తెరుచుకున్నా సినిమాలు మునుప‌టిలా ఎప్ప‌టికి ఆడ‌తాయో తెలియ‌దు. పైగా నితిన్ రెండు వ‌రుస ఫ్లాపుల మీదున్నాడు. ఇలాంటి టైంలో మాస్ట్రో మూవీకి రూ.32 కోట్ల రేటు ప‌ల‌క‌డం అంటే నితిన్ జాక్ పాట్ కొట్టిన‌ట్లే.

ఒక‌వేళ శాటిలైట్ రైట్స్ అట్టిపెట్టుకుని ఉంటే మాత్రం మ‌రింత ప్ర‌యోజ‌నం పొందనున్న‌ట్లే. ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ రూపొందించిన ఈ చిత్రం హిందీ హిట్ అంధాదున్ ఆధారంగా తెర‌కెక్కింది.