కరోనా అక్కడ సోకింది.. ఎన్ని ప్రాణాలు పోతాయో

కరోనా వైరస్ జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వస్తే చాలా ప్రమాదం అని.. దాని వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అప్పటికి ఎంతమందికి ఈ వైరస్ ఉందో కానీ.. ఇప్పుడు వారిలో వేలమంది కరోనా బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ప్రకటించి అందరూ ఇంటిపట్టున ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. ఉన్నత, మధ్యతరగతి జనాల్లో అవగాహన ఉంటుంది. సాధ్యమైనంత వరకు లాక్ డౌన్ పాటిస్తారు.

ఇళ్లు, మనుషుల మధ్య దూరం పాటించేందుకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ వర్గాలున్న చోట్ల ఎవరికైనా వైరస్ వచ్చినా.. వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉండదు. కానీ పెద్ద ఎత్తున పేదలు నివసించే మురికివాడల్లో వైరస్ ప్రబలితే నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది. అందుకే అలాంటి చోట్ల వైరస్ ఎవరికీ సోకకూడదని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి.

కానీ దేశంలోనే అతి పెద్దదైన మురికివాడలో ఇప్పుడు కరోనా కేసులు రెండు బయటపడటం కలకలం రేపుతోంది. ముంబయి సిటీలోని ధారావి మురికివాడలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇక్కడ రెండు కిలోమీటర్ల ప్రాంతంలో ఏకంగా 20 లక్షల మంది జనాలుంటారు. చిన్న ఇంట్లో ఎనిమిది మంది నివసిస్తారు. అక్కడ జన సాంద్రత ఎలా ఉంటుందనేది ‘కాలా’, ‘గల్లీ బాయ్’ లాంటి సినిమాల్లో చూసే ఉంటారు.

అక్కడ సోషల్ డిస్టన్స్ పాటించడం దాదాపు అసాధ్యం. అక్కడ శానిటైజేషన్ పనులు చేపట్టడం.. జనాలు ఈ విషయంలో అవగాహనతో ఉండటం కూడా కష్టమే. అలాంటి చోట రెండు కరోనా కేసులు బయటపడటంతో వాళ్లు ఇంకెంతమందికి అంటించారో.. కొన్ని రోజుల తర్వాత అక్కడ కరోనా కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో.. ఎంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్నది మహారాష్ట్రలోనే అన్న సంగతి తెలిసిందే.