ఓట్లు అడ‌గ‌టంలో లోకేష్ రాటుదేలాడుగా

ఓట్లు అడ‌గ‌టంలో లోకేష్ రాటుదేలాడుగా

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను చూసిన‌వారికి ఇప్పుడు కొత్త అభిప్రాయం క‌లుగుతోంది! కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు పార్టీ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు, ఇటీవ‌ల మంత్రిగా త‌నకు అప్ప‌గించిన శాఖ‌ల వ్య‌వ‌హారాలు చూసుకుంటున్న నారా లోకేష్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో రాటుదేలిన నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని అంటున్నారు. అలా ఇలా కాకుండా ఏకంగా మ‌రో ఏడాదిన్న‌ర త‌ర్వాత ఉన్న ఎన్నిక‌ల‌కు లోకేష్ సిద్ధ‌మ‌వుతున్నార‌ని చెప్తున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేస్తున్న గార్బేజ్ బయో మైనింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ మంత్రి లోకేష్ మాట్లాడిన తీరు ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు.

దేశంలోనే కాదు ప్రపంచలోనే ఏ నేత కష్టపడని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తూ పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్థికి పాటుపడుతున్నారని నారా లోకేష్ త‌న తండ్రిని పొగిడారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని విభజించిన వారు ఓడిపోయి మిన్నకున్నారని, కలెక్టర్‌కు సైతం ఆఫీస్, బంగ్లాలు ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎటువంటి సదుపాయం లేని రోజుల్లో బస్సు నుంచే పాలన ప్రారంభించిన ఘ‌న‌త‌ సీఎం చంద్రబాబుకు ద‌క్కుతుంద‌న్నారు. సరైన నిధులు లేకున్నా పెన్షన్లు, రుణమాఫీలను అమలుచేసిన వైనం అభినందనీయమన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు పెరుగుతుండగా విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు ముందుకొస్తున్న సీఎం చంద్రబాబు ఒక్కరేనన్నారు.ప్రపంచ దేశాలు, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి 2019 ఎన్నికల్లోకూడా తిరిగి పట్టం కట్టాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

విజయవాడను హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు దీటుగా అభివృద్ధిపర్చడమే కాకుండా ఐటీ రంగంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిపర్చి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని లోకేష్‌ వివరించారు. ప్రత్యేక నిధులతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో 4వేల 600 కోట్ల నిధులతో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా తదితర వౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, విజయవాడ నగర సమస్యల సత్వర పరిష్కారానికి ఇన్‌చార్జ్ మంత్రిగా తాను ప్రత్యేక చొరవ తీసుకొంటున్నానని పేర్కొన్న ఆయన 2019 ఎన్నికల్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ వరకూ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రజలు, కార్యకర్తలదేనని పిలుపునిచ్చారు. హాజ‌రైంది పార్టీ కార్య‌క్ర‌మం కాక‌పోయిన‌ప్ప‌టికీ...ఎన్నిక‌లు ఇప్పుడే లేన‌ప్ప‌టికీ అభివృద్ధి కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా లోకేష్ ఇలాంటి పిలుపునివ్వ‌డం ఆయ‌న దూకుడుకు నిద‌ర్శ‌న‌మని ప‌లువురు అంటున్నారు.