సమీక్ష- జగమే తంత్రం

2/5

158 Mins   |   Netflix   |   18-06-2021


Cast - Dhanush, Aishwarya Lekshmi, James Cosmo, Joju George, Kalaiyarasan, and others

Director - Karthik Subbaraj

Producer - S. Sashikanth, Chakravarthy Ramachandra

Banner - Y NOT Studios, Reliance Ent

Music - Santhosh Narayanan

మంచి నటుడిగా వుండాలనుకుంటే ఎంచుకునే సినిమాలు వేరు. సూపర్ స్టార్ గా మారాలనుకుంటే సెలక్ట్ చేసుకునే కథలు వేరు. ధనుష్ మంచి నటుడు. ఆ కోణంలో అతను చేసిన సినిమాలు అతన్ని మంచి నటుడిగా నిలబెట్టాయి. కానీ అది చాలదుగా. విజయ్, అజిత్, లాంటి సూపర్ స్టార్ ల సరసన నిలవాలి. మామ రజనీ లా సూపర్ స్టార్ అనిపించుకోవాలి. అలాంటి ఆలోచనతోనే చేసిన సినిమా జగమే తంత్రం. హీరో ధనుష్ ఇలా ఆలోచిస్తే, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కూడా అదే కోణంలో ఆలోచించాడు. తమిళ జనాలు హీరోలా ఆరాధించాలంటే మంచి నటనకు అవకాశం వున్న కథ కాదు, హీరోయిజం వున్న కథ కావాలి. తమిళుల కోసం పోరాడిన హీరో కథ కావాలి. అందుకే జగమేతంత్రం లాంటి కథ తీసుకున్నాడు.

ప్రపంచంలో తమిళులకు చాలా చోట సమస్యలు వున్నాయి. అది శ్రీలంకలో అయినా, మలేషియాలో అయినా, ముంబాయిలో అయినా. ఈ మేరకు సినిమాలు వచ్చేసాయి. ఇక మిగిలింది లండన్. అందుకే ఆ నేపథ్యం తీసుకున్నారు. అలా అని కథమీ కొత్తగా వుండదు. ఓ లోకల్ హీరోను ఓ ఇంటర్నేషనల్ డాన్ వలవేసి పట్టుకుని మరీ తీసుకెళ్తాడు. కేవలం డబ్బు కోసం వెళ్లి అమాయకంగా ఆ డాన్ చెప్పిన పని చేసేస్తాడు. కానీ అప్పుడు తెలిసి వస్తుంది తాను తప్పు చేసానని, తమిళ జాతికి ద్రోహం లాంటి పని చేసానని. అప్పుడు ఆ తప్పును ఎలా సరిదిద్దుకున్నాడన్నది మిగిలిన సినిమా.

శ్రీలంక తమిళ శరణార్ధులు అన్న పాయింట్ ను తీసేస్తే ఇలాంటి లైన్ తో సినిమాలు చాలా వచ్చాయి. పోనీ ఆ పాయింట్ కలిపినా, ఇప్పుటికే వలసపోయిన తమిళ జనాల సమస్యలతో పలు సినిమాలు వచ్చాయి కనుక అక్కడా కొత్త దనం వుండదు. ఇక కొత్త దనం తీసుకురావాల్సింది కేవలం టేకింగ్ లోనే. అక్కడే హీరో ఇంకా దర్శకుడు కలిసి చేసింది ఏమిటంటే, సూపర్ స్టార్ రజనీ స్టయిల్ లోకి ధనుష్ ను తీసుకురావడం.

సినిమా మొత్తం మీద ధనుష్ తన కేక్ వాక్ లాంటి నటనలో మిక్స్ చేసింది అదే. వీలయినంత వరకు రజనీ స్టయిల్ ను తన బాడీ లాంగ్వేజ్ లో పలికించడం. ఈ యావలో పని దర్శకుడు తన పని మరచిపోయాడు. సినిమా ఎత్తుగడే నెమ్మదిగా సాగుతుంది. ప్రేక్షకుడికి అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో, చూపించాలనుకుంటున్నాడో అంతు పట్టడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికి సినిమా దాదాపుగా సగానికి చేరుకుంటుంది.ఇలాంటి నేపథ్యంలో సినిమా చూడాలనే ఉత్సాహం, మూడ్, ఆసక్తి అన్నీ సన్నగిల్లిపోతాయి.

ఒకసారి అసలు విషయం బయటకు వచ్చి, హీరో రివర్స్ గేర్ వేసాక జనాలకు అర్థం కావాల్సిందానికన్నా, ఎక్కువే అర్థం అయిపోతుంది. విలన్ గా వున్న హీరో సిసలైన హీరోగా మారాడని, విలన్ ఆట కట్టిస్తాడని ముందే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ అక్కడ నుంచి చూడడానికి కూడా సినిమా పెద్దగా మిగలదు. చటుక్కున క్లయిమాక్స్ లోకి జారిపోతుంది.

సినిమాలో కీలకమైన సన్నివేశాలు కొన్ని వున్నాయి. కానీ అవి కూడా ప్రేక్షకుడిలో ఏమంత చలనం కలిగించవు. హీరోయిన్ ట్విస్ట్ సీన్ కానీ, మురుగేశన్ మాత్రం చనిపోయిన సీన్ కానీ, హీరో తల్లి వెళ్లిపోయే సీన్ కానీ పెద్దగా ఇంపాక్ట్ కలిగించవు. సినిమా నిండా భారీతనం,యాక్షన్ సీన్ల నడుమ లైటర్ కామెడీ సీన్లు ఇరుక్కుపోయాయి. చిన్న చిన్న పంచ్ లు నలిగిపోయాయి.

ఇలాంటి సినిమా ధనుష్ కోసమే తీసారు. అతను తన స్టయిల్ కు రజనీ స్టయిల్ మిక్స్ చేసి చకచకా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మికి అంత స్కోప్ లేదు. విలన్ పాత్ర ధారి హాలీవుడ్ స్టయిల్ లో సెటిల్డ్ గా చేసేసాడు. సినిమాలో భారీతనం ప్రేక్షకులకు కొత్త కాదు. కథ, కథనాలు కూడా దానికి యాడ్ అయితే వేరేగా వుండేది. కానీ అలా జరగలేదు. సాంకేతిక విలువులు బాగానే వున్నాయి. ఇంత ఖర్చు చేసాక అదేమంత చెప్పుకోదగ్గంత విషయం కాదు.

మొత్తం మీద జగమే తంత్రం మూవీ లవర్స్ కు ఓ డిస్సపాయింట్ మెంట్.

ప్లస్ పాయింట్లు

ధనుష్

మైనస్ పాయింట్లు

కథ, కథనం

ఫినిషింగ్ టచ్: రజనీ స్టయిల్ లో ధనుష్ సినిమా