viral: బాలుడిపై పోలీసుల ప్ర‌తాపం

viral: బాలుడిపై పోలీసుల ప్ర‌తాపం

ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల్సిన పోలీసులు భ‌క్ష‌కులుగా మారుతున్నారు. చ‌ట్ట ప్ర‌కారం విధులు నిర్వ‌హించాల్సిన పోలీసులు ఆ చ‌ట్టాల‌నే బుట్ట‌దాఖ‌లు చేస్తున్నారు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని కాకుండా దేశ వ్యాప్తంగా పోలీసుల శైలి ఇలానే ఉంది. వాస్త‌వానికి మైన‌ర్ల‌ను, మ‌హిళ‌ల‌ను పోలీసులు ట‌చ్ చేయ‌కూడ‌ద‌ని చ‌ట్టం చెబుతోంది. అయినా కూడా పోలీసులు త‌మ ప్ర‌తాపం చూపిస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ మైన‌ర్ బాలుడిని పోలీసులు దొంగ‌తనం కేసులో అదుపులోకి తీసుకుని చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. వీటిని భ‌రించ‌లేక ఆబాలుడు అయ్యో.. బాబో! అంటున్నా.. కూడా పోలీసులు క‌నిక‌రించలేదు. అయితే, ఈ ఉదంతం మొత్తాన్ని ఎవ‌రో వీడియో తీసి.. దానిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌డంతో పోలీసుల బండారం బ‌య‌ట‌ప‌డింది.

విష‌యంలోకి వెళ్తే..  ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో  దొంగతనం ఆరోపణలపై ఓ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ‌త‌నానికి గురైన  వస్తువు ఎక్కడ దాచాడో చెప్పాలంటూ అతన్ని వేధించటం మొదలుపెట్టారు. ముందు ఓ వెదురు బొంగును అతని తోడలపై పెట్టి ఇరుపక్కల అధికారులు నిల్చున్నారు. మొత్తంగా ఇద్ద‌రి బ‌రువు దాదాపు 180 కిలోలు ఉండ‌డంతో ఆ బాలుడు త‌ట్టుకోలేక కేక‌లు పెట్టి రోదించాడు. అయినా కూడా పోలీసులు క‌నిక‌రించ‌లేదు. ఆపై మరో అధికారి లాఠీ తీసుకుని అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాదారు.

 కాలితో తంతుంటే ఆ పిల్లాడు  కాళ్లా వేళ్లా ప‌డ్డాడు.  పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించ‌డం తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే, ఎవ‌రో ఒక గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఈ మొత్తం ఉదంతాన్ని వీడియో తీసి.. యూట్యూబ్‌లో అప్ చేశాడు. ఇప్పుడు ఇది దేశ‌వ్యాప్తంగా భారీగా వైర‌ల్ అవుతోంది. యూపీ పోలీసులపై ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నారు.  

కాగా, ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ అశుతోష్ శుక్లా స్పందించారు. పనియారా స్టేషన్‌ పరిధిలో ఇది చోటు చేసుకుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఘటనపై ఇప‍్పటికే సబ్ ఇన్ స్పెక్టర్ కేఎన్ షాహి, మరో పోలీసును సస్పెండ్ చేశామని వెల్లడించారు. చోరీకి గురైన వస్తువుల రికవరీ కోసమే వారు అలా ప్రవర్తించారని.. అతని వద్ద ఏం లభించకపోవటంతో వదిలేశారని శుక్లా చెబుతున్నారు. అయితే, పోలీసుల వ్య‌వ‌హార శైలిని విప‌క్షాలు త‌ప్పుప‌డుతున్నాయి. మ‌రి ప్ర‌భుత్వం ఎలారియాక్ట్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు