బిగ్ బాస్ తెలుగు.. టైం ఫిక్స్


కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. రెండు నెలల పాటు సినీ, టీవీ రంగంలో చాలావరకు కార్యకలాపాలూ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి తెలుగులో ‘బిగ్ బాస్’ షో ఉండదేమో అన్న సందేహాలు కలిగాయి. అసలు దాని గురించి చప్పుడే లేకుండా పోయింది. మామూలుగా అయితే ఈపాటికి కొత్త సీజన్‌కు జోరుగా సన్నాహాలు జరుగుతుండాలి. కొన్ని రోజుల్లో షో మొదలవబోతుండాలి. కానీ ఐదో సీజన్ ఉంటుందన్న సంకేతాలే కనిపించడం లేదు. దీంతో ఐదో సీజన్ ఆపేస్తారా అన్న డౌట్లు కొడుతున్నాయి జనాలకు.

కానీ కొంచెం లేటుగా అయినా షోను కొనసాగించడానికే ‘స్టార్ మా’ యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం. ఐదో సీజన్‌ను సెప్టెంబరులో మొదలుపెట్టే యోచనలో నిర్వాహకులు ఉన్నారట. గత ఏడాది కంటే నెల ముందుగా షో మొదలవుతుందని అంటున్నారు.

సినీ, టీవీ రంగంలో కార్యకలాపాలు జులైలో పూర్తి స్థాయిలో ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ఐతే ఆ వెంటనే ‘బిగ్ బాస్’ను మొదలుపెట్టేయడం సాధ్యం కాదు. ఇలా అనుకుంటే అలా స్టార్ట్ చేసే షో కాదు. పార్టిసిపెంట్లను వెతకాలి. ఆడిషన్స్ చేయాలి. వాళ్లను కొంతమేర ట్రైన్ చేయాలి. వాళ్లను స్టడీ చేయాలి. వారిపై ఏవీలు తీయాలి. షోను కొత్తగా డిజైన్ చేయాలి. సెట్టింగ్స్ వేయాలి. ఇలా చాలా తతంగమే ఉంటుంది. ఇందుకోసం రెండు నెలలకు పైగా టైం కేటాయించి.. ఆ తర్వాత ఐదో సీజన్‌ను మొదలుపెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారట.

వరుసగా మూడో సీజన్లోనూ నాగార్జుననే షోను హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. షో మొదలయ్యే లోపు నాగ్ మాగ్జిమం డేట్లు ప్రవీణ్ సత్తారు సినిమాకు కేటాయిస్తాడు. ఔట్ డోర్ షూటింగ్స్ ఉంటే ముందు అవి లాగించేస్తాడు. ‘బిగ్ బాస్’ ఉన్న టైంలో నాగ్ హైదరాబాద్‌లోనే ఉంటూ వీలు చూసుకుని ఆ షూటింగ్‌కు వెళ్తాడు.