రైతు చట్టాలు వెంటాడుతున్నాయా ?

వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని రైతు చట్టాలు వెంటాడుతున్నాయా ? అవుననే అంటున్నాయి యూపిలోని ప్రతిపక్షాలు. దాదాపు ఏడాది క్రిందట నరేంద్రమోడి సర్కార్ ఆమోదించిన మూడూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని యూనియన్ నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఎట్టి పరిస్ధితుల్లోను చట్టాలను రద్దు చేసేది లేదని మోడి గట్టిగా కూర్చున్నారు. ఎందుకంటే వ్యవసాయ చట్టాలను రద్దు చేయటాన్ని మోడి ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. అందుకనే ఢిల్లీ శివార్లలో రైతులు గడచిన ఏడాదిగా ఎన్ని ఆందోళనలు చేసినా మోడి ఏమాత్రం పట్టించుకోవటంలేదు. చట్టాల అమలుపై కేంద్రమంత్రులతో చర్చలు జరిగినా, సుప్రింకోర్టు జోక్యం చేసుకున్నా పరిష్కారమైతే కనబడలేదు. దాంతో ఇటు కేంద్రప్రభుత్వం అటు రైతుసంఘాల మధ్య ప్రతిష్టంభన కంటిన్యు అవుతోంది.

ఈ నేపధ్యంలోనే తొందరలో జరగబోయే యూపీ ఎన్నికల్లో రైతుల ఆందోళన ప్రభావం పడటం ఖాయమని అర్ధమవుతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణలో యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలాగే లవ్ జీహాద్, గాయ్ ఆతంక్(కౌ టెర్రర) వివాదాలు పెరిగిపోతున్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినేసింది. ఫలితంగా యోగి ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. దీని ప్రభావం మొన్ననే జరిగిన స్దానికసంస్ధల ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది.

సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే రైతు సంఘాలు కూడా తమ ఆందోళనను మరింత ఉధృతం చేయబోతున్నాయి. రాకేష్ తికాయత్ జాట్ వర్గానికి చెందిన నేత. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో జాట్లంతా తికాయత్ కు మద్దతుగా నిలబడ్డారు. అంటే జాట్లంతా బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయినట్లే అనుకోవాలి. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ చౌధరి కూడా తికాయత్ తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించారు.

అంటే ఒకవైపు రైతులు మరోవైపు ఎస్పీ+ఆర్ఎల్డీ, బీఎస్పీ లాంటి బలమైన ప్రతిపక్షాలు ఇదే సమయంలో జనాల్లో వ్యతిరేకత..వెరసి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కష్టమనే సంకేతాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కూడా రైతు సంఘాలు బీజేపీకి ఓట్లేయద్దని పదుల సంఖ్యలో బహిరంగసభలు నిర్వహించాయి. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే మోడిని రైతు చట్టాలు వెంటాడుతున్నట్లే ఉంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.