ట్రంప్ గురించి కుమారుడి సంచ‌ల‌న ట్వీట్‌

ట్రంప్ గురించి కుమారుడి సంచ‌ల‌న ట్వీట్‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆయ‌న గెలుపు వెనుక మ‌రో కోణం తెర‌మీద‌కు రాగా దాన్ని బ‌య‌ట‌పెట్టింది స్వ‌యంగా ఆయ‌న త‌న‌యుడే. వికీలీక్స్‌ సంస్థతో తనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పెద్ద కుమారుడు జాన్‌ ట్రంప్‌ జూనియర్‌ సంచలన ప్రకటన చేశారు. అంతేగాకుండా, 2016 సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 12 మధ్యకాలంలో వికీలీక్స్‌ సంస్థతో త‌ను జరిపిన చాటింగ్‌ను కూడా స్వ‌యంగా ఆయ‌నే బయటపెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ప‌రిణామంపై విప‌క్షాలు త‌మ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలింద‌ని పేర్కొంటున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని యూఎస్‌ నిఘా వ్యవస్థ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈవిషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పలుమార్లు ఖండించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ నేత హిల్లరీ ఓటమికి రష్యాతో ఎలాంటి సంబంధం లేదన్నారు. హిల్లరీపై అవినీతి ఆరోపణలు ఉండటంతోనే ప్రజలు ట్రంప్‌ను ఎన్నుకున్నారని అన్నారు. అమెరికా నిఘా వర్గాల దగ్గర కూడా రష్యా హ్యాకింగ్‌కు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. తాజాగా జాన్‌ ట్రంప్‌ జూనియర్‌ చేసిన ట్వీట్స్‌ అమెరికాలో కలకలం రేపుతున్నాయి. వికీలీక్స్‌కు తనకు మధ్య జరిగిన ట్విట్టర్‌ సంభాషణను ఆయన పోస్ట్‌ చేశారు. 2016 సెప్టెంబర్‌ 9న వికీలీక్స్‌.. జూనియర్‌ ట్రంప్‌కు ఓ మెసేజ్‌ పెట్టింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా నడిచే ఓ వెబ్‌సైట్‌ గురించి అందులో సమాచారం ఇచ్చింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓ వెబ్‌సైట్‌ చాలా కీలకంగా పనిచేస్తోందంటూ.. దీని వెనుక ఉన్నది ఎవరో తెలుసా? అని అడుగుతూ దాని పాస్‌వర్డ్‌తో సహా వికీలిక్స్‌.. ట్రంప్‌ పెద్ద కుమారుడికి ఓ మెసేజ్‌ పెట్టింది. దానికి.. 'దీని వెనక ఉన్నది ఎవరో నాకుతెలియదు. దీని సంగతి ఆరా తీస్తాను. థ్యాంక్యూ..' అని జూనియర్‌ ట్రంప్‌ రిప్లయి కూడా ఇచ్చారు.

అనంత‌రం హిల్లరీ క్లింటన్‌ గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా పలు ఆర్టికల్స్‌ లింక్స్‌ ఇస్తూ, దీని గురించి ప్రచారంలో మాట్లాడాలంటూ వికీలీక్స్‌.. జూనియర్‌ ట్రంప్‌కు పలు సందేశాలు పంపింది. ఓ తరుణంలో ట్రంప్‌ ఆదాయ వివరాలు ఇస్తే.. హిల్లరీకి గట్టి సమాధానం చెప్పొచ్చని కూడా సూచించింది. ఇలా అక్టోబర్‌ నెల వరకు తనకు, వికీలీక్స్‌కు మధ్య జరిగిన చాటింగ్‌ను జూనియర్‌ ట్రంప్‌ బహిర్గతం చేశారు. తాను కొన్ని మెసేజ్‌లకు మాత్రమే బదులిచ్చానని చెప్పుకొచ్చారు. వికీలీక్స్‌ సంస్థ జూనియర్‌ ట్రంప్‌ సహకారంతో హిల్లరీ గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా హ్యాకింగ్‌కు పాల్పడిందంటూ పేర్కొంటూ 'ది అట్లాంటిక్‌' అనే వార్తా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రచురితమైన కొద్ది గంటల్లోనే జూనియర్‌ ట్రంప్‌.. ట్విటర్లో తనకు, వికీలీక్స్‌కు మధ్య జరిగిన సంభాషణను తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా బహిర్గతం చేశారు. ఈ రెండు సంఘ‌ట‌న‌ల‌తో ట్రంప్ విజ‌యం వెనుక ఏదో జ‌రిగింద‌ని విప‌క్ష నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు