కొత్త డ్రెస్‌లో ట్రంప్ లుక్ అదిరిందిగా!

కొత్త డ్రెస్‌లో ట్రంప్ లుక్ అదిరిందిగా!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మ‌నం ఏ డ్రెస్‌లో చూసి ఉంటాం. ఏ డ్రెస్ ఏమిటీ? ఆయ‌న ఎప్పుడు నిండైన సూట్‌లోనే క‌దా క‌నిపించేది అంటారా?  సూట్ ఓకే గానీ... ఆయ‌న దిన‌చ‌ర్య‌ను కాస్తంత ద‌గ్గ‌ర‌గా, మ‌రింత క‌ళ్లు పెద్దవి చేసుకుని చూసినా... ఎప్పుడో ఒక‌సారి ఏదో ట్రాక్ సూట్‌లో కనిపించి ఉంటారు గానీ... ఇంకే ర‌క‌మైన వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఆయ‌న‌న‌ను చూసి ఉండమ‌ని నిస్సందేహంగా చెప్పేయొచ్చు. అయినా స‌డెన్‌గా ట్రంప్‌కు సంబంధించిన ఈ కొత్త త‌ర‌హా ఆరా ఎందుక‌ని అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. పిలిప్పీన్స్ రాజ‌ధాని మ‌నీలాలో నిన్న ఆసియాన్ సద‌స్సు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ద‌స్సుకు భార‌త్‌, జ‌పాన్ త‌దిత‌ర దేశాల‌తో పాటు అమెరికా కూడా స‌భ్య‌దేశంగా హాజ‌రైంది.

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడి హోదాలో ట్రంప్ ఆ స‌ద‌స్సుకు హాజ‌రు కాగా... జ‌పాన్ నుంచి ఆ దేశ ప్ర‌ధాని షింజో అబే, భార‌త ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోదీ త‌దిత‌రులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ స‌ద‌స్సుకు వ‌చ్చిన దేశాధినేత‌ల‌కు మ‌నీలా లోక‌ల్ ఫ్లేవ‌ర్‌ను టేస్ట్ చేయిస్తూ పిలిప్పీన్స్ ప్ర‌భుత్వం అక్క‌డి సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌తో కూడిన డ్రెస్‌ల‌ను అందించింది. ఈ డ్రెస్‌ల‌తోనే ఆయా దేశాధినేత‌లంతా నిన్న రాత్రి డిన్న‌ర్‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అంతా ఒకే డ్రెస్‌ల్లో క‌నిపించిన దేశాధినేత‌లు ఓ విందుకు ఓ కొత్త రూపునే ఇచ్చార‌ని చెప్పాలి. అంద‌రూ ఒకే రంగు, ఒకే త‌ర‌హా దుస్తుల‌తో క‌నిపించేస‌రికి నిజంగానే... అక్క‌డ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణ‌మే చోటుచేసుకుందని చెప్పాలి. ఇక ట్రంప్ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టిదాకా దాదాపుగా సూట్ త‌ప్పించి వేరే ఏ ర‌క‌మైన డ్రెస్‌లో క‌నిపించ‌ని ట్రంప్‌... మ‌నీలా లోకల్ డ్రెస్‌లో నిజంగానే మెరిసిపోయార‌ని చెప్పాలి.

అయినా మ‌నీలా లోక‌ల్ సూట్ ఎలా ఉంద‌న్న విష‌యానికి వ‌స్తే... మ‌నం వేసుకునే కుర్తా పైజామా మాదిరిగా క‌నిపించే ఆ డ్రెస్‌లో కుర్తా కాస్తంత కుర‌చ‌గా ఉంది. ఇక పైజామా స్థానంలో ప్యాంటునే వాడేశారు. పొట్టి కుర్తాలో ఫుల్ హ్యాండ్స్ ఉండ‌గా, ష‌ర్ట్ పొడ‌వు సాధార‌ణ కుర్తా కంటే కాస్తంత త‌క్కువ‌గా, సాధార‌ణ ష‌ర్ట్ పొడ‌వు కంటే కాస్తంత పెద్ద‌దిగా ఉంది. లేత గోదుమ రంగు కుర్తా, న‌లుపు రంగులో ఉన్న ప్యాంటును ధ‌రించి దేశాధినేత‌లంతా విందుకు హాజ‌రు కాగా... ట్రంప్ కూడా అదే వ‌స్త్ర‌ధార‌ణ‌లో వ‌చ్చేశారు.

అంతేకాకుండా.. అంతా ఒకే ర‌క‌మైన దుస్తుల్లో అక్క‌డికి విచ్చేసిన దేశాధినేత‌లు ఫొటోల‌కు ఫోజులిచ్చేశారు. విందు ముగిసే దాకా చాలా ఉల్లాసంగా గ‌డిపారు. అంద‌రికంటే కూడా మ‌న ప్ఱ‌ధాని న‌రేంద్ర మోదీ... అంద‌రు దేశాధినేత‌ల‌తో క‌లుపుగోలుగా మాట్లాడుతూ చాలా చ‌లాకీగా క‌నిపించారు. మొత్తానికి కొత్త వ‌స్త్ర‌ధార‌ణ‌లో క‌నిపించిన ట్రంప్‌... ఆ విందుకే హైలెట్ అని చెప్పక త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు