వీడ్నేం చేయాలి?: వ‌ందేళ్ల వృద్ధురాలిపై రేప్‌

 వీడ్నేం చేయాలి?: వ‌ందేళ్ల వృద్ధురాలిపై రేప్‌

ఏం మాట్లాడాలి? ఈ దేశంలో కొంద‌రు ఎంత దారుణంగా త‌యార‌వుతున్నార‌న‌టానికి తాజా ఉదంతం పెద్ద ఉదాహ‌ర‌ణ‌. వందేళ్ల వృద్ధురాలు. ఆపై తీవ్ర అనారోగ్యం. అలాంటి దీన స్థితిలో ఉన్న పండు ముస‌లిపై కామ‌వాంఛ ఎలా క‌లిగిందన్న ఆలోచ‌న‌కే ఒళ్లు గ‌గుర్పాటుకు గురి కావ‌టం ఖాయం. ప‌సిపిల్ల‌ల్ని వ‌ద‌ల‌ని మృగాళ్లు.. ఇప్పుడు పండు ముస‌లిని కూడా విడిచిపెట్ట‌ని వైనం చూస్తే.. క‌డుపు ర‌గిలిపోవ‌టం ఖాయం.

ఈ దారుణ సంఘ‌ట‌న‌కు వేదికైంది బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ శివారు. ద‌ళిత కుటుంబానికి చెందిన ఒక వృద్ధురాలు వ‌యోభారంతో కొన్నేళ్లుగా మంచానికే ప‌రిమిత‌మైపోయింది. ఇటీవ‌ల ఆమె తీవ్ర అస్వ‌స్థ‌తో ఉన్నారు. ఆదివారం ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఇంట్లోకి ప్ర‌వేశించిన 35 ఏళ్ల అంకిత్ పునియా అనే యువ‌కుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు.
గ‌ట్టిగా అర‌వలేని స్థితిలో ఆమె దీనంగా ఏడ్చిన ఏడుపు విని.. అక్క‌డి చుట్టుప‌క్క‌ల వారు రియాక్ట్ అయ్యారు. ఏం జ‌రిగిందో అన్న ఆందోళ‌న‌తో త‌లుపులు తెర‌వ‌గా.. యువ‌కుడు చేస్తున్న అకృత్యం అక్క‌డి వారిని షాక్ కు గురి చేసింది. వెంట‌నే అత‌డ్ని బంధించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వందేళ్ల వ‌య‌సు కావ‌టం.. అనారోగ్యంతో ఉండ‌టంతో.. మృగాడి ప‌శుత్వానికి ఆమె బ‌ల‌హీన ప్రాణం గాల్లో క‌లిసిపోయింది.

ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ఆమె ఆరోగ్యం మ‌రింత విష‌మించింది. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి.. వైద్యం చేసే స‌మ‌యానికి ఆమె మ‌ర‌ణించింద‌ని స్థానిక వైద్యులు పోలీసుల‌కు తెలిపారు.పోస్ట్ మార్టం అనంత‌రం ఆమె శ‌రీర భాగాల్ని ఫోరెన్సిక్ లాబ్‌కు పంపారు. మాన‌వ రూపంలో ఉన్న ప‌శువు అంకిత్‌పై ఐపీసీ సెక్ష‌న్లు 458.. 376.. ఎస్సీ.. ఎస్టీ చ‌ట్టాల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. వృద్ధురాలు మ‌ర‌ణించిన త‌ర్వాత  302 సెక్ష‌న్‌ను కూడా చేర్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఏమైందో ఏమో కానీ యూపీ.. పంజాబ్ రాష్ట్రాల్లో వృద్ధుల‌పై అత్యాచార ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా వెలుగు చూస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు