రేవంత్ రాజీనామా లేఖ‌లో....ఇవ‌న్నీ ఉన్నాయిట‌

రేవంత్ రాజీనామా లేఖ‌లో....ఇవ‌న్నీ ఉన్నాయిట‌

తెలంగాణ టీడీపీ కుదుపుల‌కు బ్రేక్ ప‌డింది. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత‌, టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కం ఫ్లోర్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి త‌న ప‌ద‌వుల‌కు గుడ్ బై చెప్పేశారు. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడితో స‌మావేశం సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. అనంత‌రం...త‌న రాజీనామా లేఖ‌ను మీడియాకు కూడా ఇచ్చేశారు. అంతా ఊహించిన‌ట్లుగానే..కేవ‌లం పార్టీ ప‌ద‌వుల‌కు మాత్ర‌మే రాజీనామా చేయ‌కుండా...ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు.

అయితే త‌న‌ను ఇంత స్థాయికి చేర్చిన టీడీపీకి విష‌యంలో గుడ్ బై చెప్తున్న స‌మ‌యంలో రేవంత్ ఏం చేసి ఉంటారు... త‌న లేఖ‌లో ఏం చెప్పి ఉంటార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తించే అంశ‌మే. రేవంత్ లేఖలోని సారాంశం ఇది...``టీడీపీతో బంధం తెంచుకోవడం నాకు గుండె కోతతో సమానం. సుదీర్ఘ రాజకీయ, పాలన అనుభవం ఉన్న మీతో ప్రయాణం మరిచిపోలేనిది. మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు నాకు గొప్ప అనుభవాన్నిచ్చాయి. మీ సారథ్యంలో అనేక ప్రజాపోరాటాలలో భాగస్వామి కావడం అదృష్టం. మీ అనుచరుడుగా, టీడీపీ నేతగా గుర్తింపు పొందడం నేను గర్వించే విషయం. టీడీపీలో చేరిన నాటి నుంచి ఈ క్షణం వరకు పార్టీ సిద్ధాంతం, మీ నిర్ణయాలకు కంకణబద్దుడనై పని చేశాను.
తక్కువ సమయంలో మీరు, పార్టీ నాకు గుర్తింపునిచ్చారు. సీనియర్లు ఉన్నా నాకు కీలక అవకాశాలిచ్చారు. వాటన్నింటినీ నా శక్తిమేరకు సమర్ధవంతంగా నిర్వర్తించానని నమ్ముతున్నాను. కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. వాళ్లు నన్ను తమ ఇంట్లో మనిషిగా అభిమానించారు. పోరాటాల్లో నా వెన్నంటి ఉన్నారు. మీ ప్రోత్సాహం, వాళ్లిచ్చిన ధైర్యంతో నలభై నెలలుగా కేసీఆర్ అరాచకాల పై పోరాడాను.
ఎన్టీఆర్ కూడా నా పోరాటానికి స్ఫూర్తి. అన్నగారితో నేరుగా అనుబంధం లేకపోయినా పేదోళ్ల బాగుకోసం ఆయన తపించిన విధానం నాకు స్ఫూర్తి.``అని రేవంత్ పేర్కొన్నారు.

``తెలంగాణ‌లో కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాబిన్నమయ్యాయి. ఏ వర్గాన్ని తట్టి చూసినా కష్టాలు కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వేల మంది రైతులు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. గిరిజన రైతులకు బేడీలు వేసి ఆత్మగౌరవం దెబ్బతీశారు. మల్లన్న సాగర్ ను రావణకాష్టంగా మార్చారు. నేరేళ్లలో దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. భూపాలపల్లిలో గుత్తికోయల ఆడబిడ్డలను బట్టలూడదీసి చెట్లకు కట్టేసి కొట్టారు. ఇలాంటి హృదయవిదారక సందర్భాలు అనేకం. ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్ సహించలేకపోతున్నారు. ప్రజాస్వామిక హక్కులకు రాష్ట్రంలో చోటు లేదు. వ్యవస్థల పతనం నిరాఘాటంగా సాగుతోంది. ప్రశ్నిస్తే గొంతు నొక్కడం..అసెంబ్లీలో సస్పెన్షన్ లు నిత్యకృత్యమయ్యాయి. నాపై వ్యక్తిగతంగా కక్షగట్టి అక్రమ కేసుల్లో ఇరికించిన విషయం మీకు తెలుసు. జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు.నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండెనిబ్బరం కోల్పోలేదు. ఆ సమయంలో మీరు, భువనేశ్వరి మేడమ్ కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు.`` అని రేవంత్ త‌న కృత‌జ్ఞ‌త‌ను పంచుకున్నారు.

కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని రేవంత్ ఆరోపించారు. ``బంగారు తెలంగాణ ముసుగులో ప్రజా సంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది. అమరవీరుల ఆత్మబలిదానాలకు గుర్తింపు లేదు. తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది. తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉదృతంగా పోరాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తెలంగాణ సమాజం కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. నా నిర్ణయాన్ని ఆ కోణంలోనే చూడండి. కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం, శాసన సభ సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నాను. తెలంగాణ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను. అన్యదా భావించక నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.`` అని ఆ లేఖ‌లో రేవంత త‌న అభిప్రాయాలు వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు