సచిన్ విషయంలో పెరిగిపోతున్న టెన్షన్

రాజస్ధాన్ రాజకీయాల్లో యంగ్ టర్క్ గా పెరున్న సచిన్ పైలెట్ విషయంలో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏదో రోజు సచిన్ కాంగ్రెస్ కు జైకొట్టి బీజేపీలో చేరిపోతారనే ప్రచారం పెరిగిపోతోంది. దానికితోడు కాంగ్రెస్ అధిష్టానంపై సచిన్ తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయటంతో సచిన్ విషయంలో సస్పెన్స్ పెరిగిపోతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో రాజస్ధాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సచిన్ పైలెట్ దే కీలకపాత్ర. కాబోయే సీఎం తానే అనుకుని సచిన్ రాష్ట్రమంతా బాగా తిరిగి పార్టీ నేతలను, యువనేతలను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారు. కాంగ్రెస్ పార్టీ పోరాటమో లేకపోతే బీజేపీపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతో ఏదైనా కానీండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

అయితే అందరు అనుకున్నట్లు సీఎం కుర్చీలో సచిన్ కాకుండా సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కూర్చున్నారు. దాంతో అలిగిన సచిన్ కు అధిష్టానం డిప్యుటి సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడిని చేసింది. అయితే అప్పట్లో తనకిచ్చిన హామీల్లో ఇప్పటికీ అధిష్టానం నెరవేర్చలేదని తాజాగా సచిన్ తన అసంతృప్తిని బయటపెట్టారు. దాంతో రాజస్ధాన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిజానికి ఉత్తరప్రదేశ్ లో యువనేత జితిన్ ప్రసాద్ కాంగ్రెస్ కు రాజీనామ చేసి బీజేపీలో చేరారు.

మీడియా చర్చంతా జితిన్ మీద జరగాల్సుండగా సచిన్ చుట్టూ తిరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. చివరకు మధ్యప్రదేశ్ లో యువనేత జ్యోతిరాధిత్య సింథియా చేసినట్లే ఏదో రోజు పార్టీలో సచిన్ తిరుగుబాటు లేవదీసి తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరిపోరాడనే అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింధియా తిరుగుబాటు వల్లే కూలిపోయిన విషయం తెలిసిందే.

ఒకవేళ అదేగనుక రాజస్ధాన్ లో కూడా జరిగితే చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోయిన రెండో రాష్ట్రం అవుతుంది. అంటే ఇప్పటికిప్పుడు రాజస్ధాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేకపోయినా ఏదో రోజు ఆ పరిస్ధితి ఎదురవ్వక తప్పదనే అనిపిస్తోంది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్దితులు చక్కదిద్దితే సరి లేకపోతే అంతే సంగతులు. ఇక అప్పుడు చివరగా మిగిలబోయేది చత్తీస్ ఘడ్ మాత్రమే అవుతుంది. ముందు రాజస్ధాన్ వ్యవహారం తేలిపోతే అప్పుడు చత్తీస్ ఘడ్ సంగతి. చూద్దాం ఏం జరుగుతుందో.