ట్రంప్ భార్యల స‌వతిపోరు

ట్రంప్ భార్యల స‌వతిపోరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇంటి పోరు మొద‌ల‌యింది. ఆయ‌న ఇంటి గుట్టు రచ్చకెక్కింది. అగ్రరాజ్యానికి ఆయన ప్రథమ పౌరుడు కావడంతో ఆయ‌న స‌తీమ‌ణికి ద‌క్కాల్సిన‌ `ప్రథమ మహిళ` హోదాపై చిచ్చు రేగింది. ఇది కాస్తా ముదిరి ట్రంప్‌ మాజీ భార్య, ప్రస్తుత భార్య బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. అసలేం జరిగిందంటే..ట్రంప్‌ మొదటి భార్య ఇవానా ట్రంప్‌ 'రైజింగ్‌ ట్రంప్‌' పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో ట్రంప్‌తో తన వైవాహిక జీవితం, విడాకులు, పిల్లల్ని పెంచడం లాంటి వివరాలను వెల్లడించారు. వివాహేతర సంబంధం కారణంగానే ట్రంప్‌ నుంచి తాను విడిపోయినట్టు ఇవానా చెప్పుకొచ్చారు. త్వరలో ఈ పుస్తకం విడుదల కానుంది.

ఇదిలా ఉంటే...తాజాగా ఈ పుస్తకం ప్రమోషన్‌లో భాగంగా ఇవానా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తానే ప్రథమ మహిళకు అర్హురాలిని అని చెప్పారు. ``నేను ట్రంప్‌నకు మొదటి భార్యను ఒకే.. అంటే నేను దేశానికి మొదటి మహిళను. నేను శ్వేతసౌధానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లొచ్చు. కానీ నేను వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ మెలానియా ఉంది. నేనెవరికీ అసూయ కలిగించాలని అనుకోవడం లేదు`` అని ఇవానా అన్నారు. అంతేగాక మెలానియా శ్వేతసౌధంలో ఉండేందుకు చాలా కష్టపడుతున్నట్టుంది అని విమర్శించారు. దీంతో ఇవానా వ్యాఖ్యలపై ట్రంప్‌ ప్రస్తుత భార్య మెలానియా అధికారిక ప్రతినిధి స్టీఫానీ గ్రిషామ్‌ ప్రకటన విడుదల చేశారు.

``ట్రంప్‌, ఆయన కుమారుడు బారెన్‌కు శ్వేతసౌధాన్ని ఓ సొంతింటిగా తీర్చిదిద్దారు మెలానియా. వైట్‌హౌస్‌లో నివసించడాన్ని ఆమె ఎంతో ఇష్టపడుతున్నారు. అంతేగాక ప్రథమ మహిళగా తన బాధ్యతలను ఎంతో గౌరవిస్తున్నారు. ఈ హోదాతో చిన్నారుల సంరక్షణకు ఆమె కృషిచేస్తున్నారు. అంతే కానీ.. పుస్తకాలు అమ్ము కోడానికి కాదు (ఇవానా పుస్తకాన్ని ఉద్దేశించి)``అని ప్రకటనలో పేర్కొన్నారు. ఏదేమైనా అధ్యక్షుడికి సైతం ఇంటి తిప్పలు తప్పట్లేదని అమెరిక‌న్లలో చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు