జగన్ ఎంపీల రాజీనామాలు పెద్ద డ్రామా!

జగన్ ఎంపీల రాజీనామాలు పెద్ద డ్రామా!

వైఎస్ జగన్మోహన రెడ్డి జనంలోకి వెళ్లడానికి ఏదో  తురుపుముక్కలాంటి కొన్ని డైలాగుల్ని సిద్ధం చేసుకుని వెళుతుంటారు. కొన్ని నెలలపాటు ఇంటినుంచి బయటకు రాకుండా ఆయన కసరత్తు చేసి వీటిని తయారు చేసుకుంటారు గానీ.. అవి కొన్నిసార్లు ఫెయిలవుతుంటాయి. అలాగే ‘ఎంపీలతో రాజీనామా చేయిస్తా’ అనే డైలాగు  కూడా ఒక విఫలమైన డైలాగులాగా ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపుగా ఏడాది కిందట జగన్మోహన రెడ్డి ఇదే డైలాగు వేసినప్పుడు.. అబ్బో ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో కదా అని అంతా అనుకున్నారు. ఆయన చెప్పినట్లుగా ఆ విడత పార్లమెంటు సమావేశాలు ముగిసే సమయానికి వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసేసి సంచలనం సృష్టిస్తారేమో అని అంతా ఎదురుచూశారు. సదరు జగన్ రెచ్చిపోయి ప్రకటించిన గడువు ముగిసి ఏడాది అవుతోంది. ఇప్పుడు మళ్లీ హోదా అనే మాట అందుకుని జనం ముందుకు వచ్చిన జగన్ మళ్లీ అదే  రాజీనామాల పాట పాడుతున్నారు.

తాను పాదయాత్ర చేస్తూ ప్రత్యేక హోదాకు మద్దతు కూడగడతానని కేంద్రంతో పోరాడుతానని ఆయన అంటున్నారు. ఇప్పుడు జగన్ చెబుతున్న మాట ఏంటంటే.. పాదయాత్ర తర్వాత చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామాచేయిస్తారట. తద్వారా కేంద్రం మీద ఒత్తిడి పెంచుతారట. కాస్త లోతుగా పరిశీలిస్తే.. జగన్ మాటల్లో ఎంత డ్రామా దోబూచులాడుతూ ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.

జగన్ పాదయాత్ర ఆరునెలల పాటుసాగుతుంది. అంటే మే లో అది కొలిక్కి వస్తుంది. జగన్ రాజీనామాలు అనే చివరి అస్త్రాన్ని అప్పుడు ప్రయోగిస్తారా? అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు ఒక ఏడాది మాత్రమే గడువు ఉంటుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇప్పుడు ఈసీ చెబుతున్న దాన్ని, మోదీ ప్లాన్ చేస్తున్న వ్యవహారాన్ని కలుపుకుంటే.. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. సెప్టెంబరు తర్వాత ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం అని ఈసీ ప్రకటించింది. అంటే.. వైసీపీ ఎంపీలు ‘జగన్ వేసే చివరి అస్త్రం’ లాగా రాజీనామాలు చేసిన తర్వాత.. అవి ఆమోదం పొందిన తర్వాత.. వారికి ఉప ఎన్నికలు పెట్టాల్సిన అవసరం లేకుండానే.. సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. అలాంటి సాంకేతిక పరిస్థితి ఉత్పన్నం అయింది గనుక.. తాను ఇక రాజీనామాలు చేయించడం లేదని.. ఆ తర్వాతి ఎన్నికల్లో కూడా తన పార్టీకి ఓటు వేస్తే ప్రత్యేకహోదా కోసం పోరాటాన్ని కంటిన్యూ చేస్తానని మరో కొత్త ప్రమాణం చేయడం మినహా జగన్ చేసేదేమీ లేదని పలువురు అనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు