​ముద్రగడ- జగన్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

​ముద్రగడ- జగన్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

బహిరంగంగా ఆయన జగన్ పార్టీలోని నాయకుడు ఎంతమాత్రమూ కాదు. అలాగని జగన్ కు మిత్రపక్షంగా ముద్రపడిన వ్యక్తి కూడా కాదు. కానీ రాజకీయ వర్గాల్లో ఆయన జగన్ అనుకూలురని అనేక రకాలుగా ప్రచారం జరిగింది. అయితే కాపుల డిమాండ్లను సాధించే విషయంలో పోరాటం సాగిస్తూ వచ్చిన ముద్రగడ పద్మనాభానికి, జగన్ తరఫునుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రం లభించింది.

ఒక ప్రజా ఉద్యమానికి ప్రతిపక్షం ఎలాగైతే సహకరిస్తుందో అదే తీరులో , వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ముద్రగడకు కూడా సహకరించారు. కానీ.. తాజా పరిణామాలను గమనిస్తోంటే.. ముద్రగడ జగన్ వర్గానికి గుడ్ బై చెప్పేసినట్లే కనిపిస్తోంది. రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంట్లో జరిగిన ఆంతరంగిక సమావేశం నేపథ్యంలో.. ఏమైనా బేరసారాలు ఫలించి.. ముద్రగడ ఇలాంటి నిర్ణయానికి వచ్చారా అనే సందేహాలు కూడా ప్రజలకు కలుగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానన్న చంద్రబాబునాయుడు హామీని అమల్లోకి తీసుకురావడానికి ఆ సామాజికవర్గం తరఫున ముద్రగడ ఎంత సుదీర్ఘమైన, మడమ తిప్పని పోరాటం చేస్తున్నారో అందరికీ తెలుసు. అయితే.. తాజాగా ఆయన బుధవారం చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారు. లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు, అంబేద్కర్ పోరాటశైలి తదితర చారిత్రకఅంశాలన్నిటినీ అందులో బాగానే ప్రస్తావించారు గానీ.. ముద్రగడ పద్మనాభం.. తమ డిమాండ్ ను సాధించుకునేందుకు ప్రభుత్వానికి ఓ సుదూరకాలపు గడువు ఇచ్చారు. డిసెంబరు 6వ తేదీలోగా.. బీసీ రిజర్వేషన్ హామీ అమలు చేయాలంటూ ఆయన అందులో పేర్కొన్నారు.

నిజానికి ఇది చంద్రబాబుకు చాలా ఊరట కలిగించే నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే.. ముద్రగడ రూపంలో కాపుల్లో తనను నిత్యం బద్నాం చేస్తూ మాట్లాడే నాయకుడి ప్రసంగాలకు రాబోయే మూడు నెలలు విరామం దొరుకుతుంది. ఈలోగా బోలెడు రాజకీయ పరిణామాలు జరిగిపోవచ్చు అని తెదేపా నాయకులు భావిస్తున్నారు.

అయితే తెరవెనుక సంగతులుగా అర్థమవుతున్నదేంటంటే.. ముద్రగడ, రెండు రోజుల కిందట తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లి పర్సనల్ గా కలిశారు. భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా వారి వెంట ఉన్నారు. అయితే ఈ భేటీ రాజకీయం కాదని, పూర్తిగా పర్సనల్ అని తరవాత వారు ప్రకటించారు.

ఇప్పుడు జనానికి కలుగుతున్న సందేహం ఏంటంటే.. గోరంట్ల ద్వారా ఏదైనా డీల్ కుదిరిందేమోనని, అందుకే చంద్రబాబు ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చేలా.. ముద్రగడ తన పోరాటానికి గ్యాప్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఆయన పోరాటానికి మద్దతుగా నిలిచిన జగన్ కు ముద్రగడ తాత్కాలికంగా గుడ్ బై చెప్పినట్లే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు