ఆమె రేపిస్టుల‌నే ఇంట‌ర్వ్యూ చేస్తుంది

ఆమె రేపిస్టుల‌నే ఇంట‌ర్వ్యూ చేస్తుంది

మనం చిన్న దొంగతనం చేసినవాళ్లను చూస్తే దొంగలని భయపడిపోతాం. అక్కడి దాక ఎందుకు కొంచెం దురుసుగా, కోపంగా మాట్లాడేవాళ్లను చూస్తేనే వణికిపోతాం. అలాంటిది ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 100 మంది రేపిస్టులతో మాట్లాడాలంటే.. ఇంకేమైనా ఉందా? అదీ 22 ఏళ్ల యవ్వనంలో ఉన్నఒక యువతి ఈ పని చేసిందంటే ఆమె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పకుండా ఉండలేం. మనదేశంలో అమ్మాయిలపై అత్యాచారాలు చేసి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న100 మంది నేరస్తులను మధుమిత పాండే అనే యువతి ఇంటర్వ్యూ చేసింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన మధుమిత మాస్టర్స్‌ కోసం 2011లో లండన్‌ వెళ్లింది. ప్రస్తుతం యూకేలోని అంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తోంది.

'నిర్భయ రేప్‌' ఘటనపై భారతీయుల్లో వచ్చిన స్పందన పాండేకు ఆసక్తిని కలిగించిందంట. ఆ తర్వాత కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా దేశంలో అత్యాచార ఘటనలు తగ్గకపోవడంపై పరిశోధన చేయాలని నిర్ణయించుకుంది. తర్వాత ఢిల్లీకి వచ్చి కొన్ని వారాలపాటు తీహార్‌ జైల్లోని అత్యాచార దోషులను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 100 మంది రేపిస్టులతో మాట్లాడింది. అంతేకాకుండా దోషులు చెప్పిన వివరాలతో తన డాక్టోరల్‌ థీసిస్‌ను సైతం సిద్ధం చేసుకుందంట. మధుమిత పరిశోధన ప్రకారం అత్యాచారం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నవారిలో ఎక్కువమంది నిరక్షరాస్యులేనంట. ఒకరిద్దరు మాత్రమే డిగ్రీ చదివారంట. ఆలోచనా విధానంలో మార్పు లేకపోవడం వల్లే వాళ్లు అత్యాచారాలకు తెగించినట్లు తెలుసుకున్నానని అంటోంది ఆ యువతి. అంతేకాకుండా మనదేశంలోని కుటుంబాల్లో అబ్బాయి ఎక్కువనీ, అమ్మాయి తక్కువనే చిన్నచూపు ఉండటం కూడా రేప్‌లకు కారణమేనని మధుమిత చెబుతుండటం గమనార్హం.

జైల్లో రేపిస్టుల మాటలు వింటుంటే.. వారు అనుభవిస్తున్న క్షోభ ఎవరూ అనుభవించకూడదని అనుకుంటామట. తను మాట్లాడిన వారిలో చాలామందికి రేప్ అనే పదానికి అర్థం కూడా తెలియదంట. మన విద్యా వ్యవస్థలో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడమే అత్యాచారాలకు కారణమని చెబుతోంది మధుమిత. 'సెక్స్‌ ఎడ్యుకేషన్‌' సబ్జెక్టును సిలబస్‌లో చేరిస్తే అది పిల్లల్ని పాడు చేస్తుందని, సంప్రదాయాలను దెబ్బతీస్తుందనే అపనమ్మకం మన రాజకీయ నాయకుల్లో వేళ్లూనుకుని ఉందని అంటోంది. తన పరిశోధన త్వరలో ప్రచురితం కాబోతోందని అయితే, కొంతమంది తన పుస్తకాన్ని విడుదల కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. ఆ పుస్తకం బయటకొచ్చి మనందరం దాన్ని చదవాలని కోరుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు