బాబు జీవితంపై సినిమా...

బాబు జీవితంపై సినిమా...

గ‌త ఏడాది రాజ‌కీయ‌, సినీ స‌ర్కిల్‌ల‌లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేసింది గుర్తుండే ఉంటుంది. అదే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితం ఆధారంగా సినిమా నిర్మించ‌డం. ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈ సినిమా నిర్మిస్తున్నార‌నే వార్త‌లు కొద్దికాలంగా హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే ఆ త‌ర్వాత ఈ సినిమా అప్‌డేట్స్ ఏమీ తెర‌పైకి రాలేదు. కానీ దీనికి భిన్నంగా ఏపీ సీఎం, టీడీపీ ర‌థ‌సార‌థి నారా చంద్ర‌బాబు నాయుడు సినిమా తెర‌మీద‌కు వ‌చ్చింది. బాబు జీవితం విశేషాల స‌మాహారంగా ఈ సినిమా ఉండ‌బోతోంది.

ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ అనే వ్య‌క్తి  చంద్రబాబు జీవితాన్ని వెండితెరపై చూపించనున్నారు. ఈ సినిమాకు చంద్రోదయం టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. 1996 నుంచి రాజకీయంగా ఎలా రాణించారు. ప్రజలకు ఎలా చేరువయ్యారు, ఏపీకి ఆయన చేసిన సేవలను వివరిస్తూ సినిమాను నిర్మిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజలకు చేసిన సేవలు, వారికి చేరువైన విధానం ప్రధానాంశంగా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు ఎవరూ వినని, చూడని సినిమా కనిపించబోతోందని, భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా ఇందులో సన్నివేశాలు కనిపించనున్నాయని నిర్మాత‌ చెప్తున్నారు. చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే తాము మూవీ తీస్తున్నామన్నారు.

అయితే ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమాకు భిన్నం. ఎందుకంటే కేసీఆర్ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు ప్రారంభ‌హ‌డావుడి త‌ప్ప‌ పురోగ‌తి లేదు. అదే బాబుపై తీస్తున్న చంద్రోద‌యం అనే ఈ సినిమా వేగంగా పూర్త‌వుతోంది. ఆగస్టు 4న సెట్స్‌ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 75 శాతం షూటింగ్‌ పూర్తయింది. అంతేకాదు తిరుపతిలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ జిల్లా అధ్యక్షులు సుధారాణి ప్రోమోను విడుదల చేశారు. వందేమాతరం శ్రీనివాస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌తో ప్రోమో తీర్చిదిద్దారు. త్వరలో అమరావతి వేదికగా మూవీని రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ ఫ్లాన్‌ చేస్తోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ సినిమా విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు