ఆనందయ్య ఇప్పుడెక్కడ ఉన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది క్రిష్ణపట్నం ఆనందయ్య ఉదంతం. ఆయన తయారు చేసిన మందు కరోనాకు చెక్ పెట్టేలా ఉందన్న మాట వినిపించటం తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక ఫలితాల ప్రకారం.. ఈ మందులో ఉన్నవన్నీ సాధారణ వస్తువులేనని.. వాటిని వినియోగించటం వల్ల ఎలాంటి హాని ఉండదని తేల్చారు. మరింత లోతుగా ఆయన మందుపై అధ్యయనం చేస్తున్న సంస్థలు త్వరలో నివేదికలు ఇవ్వనున్నాయి.

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు తాను మందు తయారు చేయనని చెప్పటమే కాదు.. సోషల్ మీడియా ద్వారా తమ వద్దకు ఎవరూ రావొద్దని ఆయన వెల్లడించారు కూడా. తన వద్ద మూలికలు.. సామాగ్రి లేవని.. మందు తయారు చేయటం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆయనపై పలు వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తడి ఉంది. ఇది సరిపోనట్లుగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆ మధ్యన ఆనందయ్యను తీసుకెళ్లిన పోలీసులు తర్వాత వదిలేయటం.. అరెస్టు చేయలేదని చెప్పటం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన్ను తీసుకెళ్లిన తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున వచ్చిన పోలీసులు ఆయన్ను తమతో తీసుకెళ్లారు. దీంతో.. ఆయన కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. చివరకు ఆయన్ను నెల్లూరులోని సీవీఆర్ ఆకాడమీకి తీసుకెళ్లి.. అక్కడ ఉంచినట్లుగా తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

నలుగురికి సాయం చేయాలన్న ఉద్దేశంతో.. ఉచితంగా మందు తయారు చేసి ఇవ్వటమే ఆనందయ్య చేసిన తప్పా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఒకవేళ ఆయనకు హాని ఉంటుందన్న సందేహం ఉన్నా.. భద్రతా పరమైన సమస్యలు ఉంటాయన్న అనుమానం ఉంటే ఆయనకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలే తప్పించి.. ఇలా నిర్బంధించటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఆనందయ్య విషయంలో ప్రభుత్వం ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుంటే.. అందుకే భిన్నంగా ప్రభుత్వంలో భాగమైన పోలీసుల తీరును తప్పు పడుతున్నారు.