రాజీనామాకు డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రపంచ కుబేరుడు

అత్యున్నత పదవిలో ఉన్నోళ్లు దాన్ని వదిలేందుకు ఆసక్తి చూపించరు. కానీ.. కార్పొరేట్ ప్రపంచంలో అందుకు భిన్నంగా నిర్ణయాలు ఉంటాయి. తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు ప్రపంచ కుబేరుడు. ఈ- కామర్స్ దిగ్గజం.. అమెజాన్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న జెఫ్ బెజోస్ తన పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన వారసుడ్ని వెల్లడించారు.

తాజా సీఈవోగా అమెజాన్ ఎగ్జిక్యూటివ్.. వెబ్ సర్వీస్ హెడ్ అండీ జెస్సీను ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. బెజోస్ సంగతంటారా? ఇకపై ఆయన అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. తన పదవికి జులై 5న రిజైన్ చేయాలన్న నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ రోజుకు ప్రత్యేకత ఉందని చెబుతున్నారు.

ఏ రోజైతే అమెజాన్ సంస్థ ప్రారంభమైందో.. అదే రోజున ఆయన తన సీఈవో పదవికి రిజైన్ చేయనుండటం విశేషం. జులై 5 తనకెంతో ప్రత్యేకమని.. అందుకే తాను తన పదవికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. అమెజాన్ కొత్త సారథి విషయానికి వస్తే.. 1997లో సంస్థ మార్కెటింగ్ మేనేజర్ గా చేరిన ఆండీ జెస్సీ.. తన సామర్థ్యంతో సొంతంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అమెజాన్ లో ఎదిగారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను ప్రారంభించటంలో జెస్సీ కీలకభూమిక పోషించారు. ఇప్పుడు ఏకంగా సంస్థ సీఈవో కుర్చీలో కూర్చోనున్నారు.