వైసీపీ దెబ్బకు చంద్రబాబు కౌంటర్!

వైసీపీ దెబ్బకు చంద్రబాబు కౌంటర్!

చెన్నైలోని సదావర్తి భూముల వ్యవహారం అనేది ఇప్పుడు ఏపీలోని రాజకీయ పక్షాలు పరస్పరం తమ ఆధిపత్యాన్ని తెలివితేటల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక వేదికగా మారిపోయినట్లు కనిపిస్తోంది. అవును- సదావర్తి భూములను తెలుగుదేశం నాయకులు సొంతం చేసుకుంటే.. వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా తమ ప్రత్యర్థులు లబ్ధి పొందకుండా చేశారు. అయితే.. కేసు గడుస్తూ ఉండగా.. మరో చిన్న మడతపేచీ కేసులోకి ఇంప్లీడ్ అయింది. మొత్తానికి ఈ భూముల వ్యవహారంలో అడ్డగోలు లబ్ధి అనేది అచ్చంగా వైకాపాకు కూడా దక్కకుండా పోయింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. భూములకు మళ్లీ వేలం నిర్వహిస్తారు. మొత్తానికి వైసీపీ తమ పార్టీని కొట్టిన దెబ్బకు , ఇది చంద్రబాబు తన రేంజిలో ఇచ్చిన కౌంటర్ అని అంతా అనుకుంటున్నారు.

సదావర్తి భూముల వ్యవహారం అనేది ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీల మధ్య అట్టుడికిపోయిన వ్యవహారం. చెన్నైలోని సదావర్తి సత్రానికి చెందిన ఈ భూములు రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోనివి. ఇవి సరైన ఆజమాయిషీ లేక ఇప్పటికే పలు ఆక్రమణలకు గురవుతున్నాయని, లీగల్ కేసుల్లో ఇరుక్కుంటున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని విక్రయించేసింది. కాకపోతే.. వందల కోట్ల విలువైన భూముల్ని కారుచౌకగా 22.44 కోట్లకే తెదేపా నేతలు కాజేశారంటూ వైసీపీ నానా యాగీచేసింది. కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ప్రభుత్వం ముందునుంచి కూడా అయిదు కోట్లు ఎవరైనా ఎక్కువ ఇచ్చి ఆ భూములు తీసుకోవచ్చునని చెబుతూ వచ్చింది. కోర్టు కూడా కేసు తీర్పులో అదేచెప్పింది. అయితే కేసు వేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీర్పుకు అనుగుణంగా అయిదు కోట్లు ఎక్కువగా అంటే 27.44 కోట్లు చెల్లించేశారు.

ఈలోగా వైసీపీ వారికి లాభం జరగకుండా థర్డ్ ఎండ్ నుంచి ముప్పు వచ్చి పడింది. అఖిల భారత బ్రాహ్మిణ్ అసోసియేషన్ పేరుతో ఓ సంస్థ కేసులోకి ఇంప్లీడ్ అయింది. ఈ భూములకు తాజాగా మళ్లీ బహిరంగ వేలం నిర్వహిస్తే గనుక ఇంకా ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయంటూ వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు సహజంగానే ఆ విజ్ఞప్తికి అనుగుణంగా తీర్పు ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు