ఆ మాట‌ల‌కు జ‌గ‌న్ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దా?

ఆ మాట‌ల‌కు జ‌గ‌న్ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దా?

కాలు జారినా ఫ‌ర్లేదు.. మాట మాత్రం జార‌కూడ‌దన్న‌ది చాలా పాత సామెత‌. ఇప్పుడా  సామెత ఎంత ముఖ్య‌మ‌న్న విష‌యం ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బాగానే అర్థ‌మై ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దూకుడు రాజ‌కీయాల ద‌రిద్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో షురూ చేసింది ఎవ‌రంటే.. రాజ‌కీయాల గురించి అవ‌గాహ‌న ఉన్న వారు ఎవ‌రైనా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును ట‌క్కున చెప్పేస్తారు. దూకుడు రాజ‌కీయాల్ని తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌వేశ పెట్ట‌టం ద్వారా.. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న మొహ‌మాటాల్ని.. విలువ‌ల్ని క‌ట్ట‌క‌ట్టి గోతిలో పాతేశార‌ని చెప్పాలి.

వైఎస్ రాజ‌కీయ వార‌సుడిగా వ‌చ్చిన జ‌గ‌న్ పుణ్య‌మా అని ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారాయ‌ని చెప్పాలి. గ‌తంలో ఏ రాజ‌కీయ అధినేత మాట్లాడ‌ని రీతిలో మాట్లాడ‌టం ద‌గ్గ‌ర నుంచి రాజ‌కీయాల కోసం ఎంత‌కైనా స‌రే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం జ‌గ‌న్ లో క‌నిపిస్తుంది.

ఒక‌సారి ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చిన త‌ర్వాత‌.. ఐదేళ్లు పాలించేందుకు అధికార‌ప‌క్షానికి అవ‌కాశం ఉంటుంది. కానీ.. జ‌గ‌న్ తీరు మాత్రం అందుకు భిన్నం. త‌న‌కు ప్ర‌తికూలంగా వ‌చ్చిన ఫ‌లితాల్ని ఆయ‌న జీర్ణించుకోవ‌టానికి స‌సేమిరా అంటారు. ఎంత త్వ‌ర‌గా ఎన్నిక‌లు వ‌స్తే అంత బాగుండ‌న్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయి. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల మీద త‌న‌కేమాత్రం న‌మ్మ‌కం లేద‌న్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉంటాయి.

పాల‌క‌ప‌క్షం చేసే త‌ప్పుల్ని ఎత్తి చూప‌టం త‌ప్పు కాదు. కానీ..  ఆ పేరుతో హింస‌ను రేకెత్తించేలా వ్యాఖ్య‌లు చేయ‌టంలోనే జ‌గ‌న్ తో వ‌చ్చే అతి పెద్ద ఇబ్బంది. విప‌రీత‌మైన ఫ‌స్ట్రేష‌న్ లో ఉన్న జ‌గ‌న్ కు నంద్యాల ఉప ఎన్నిక ఒక వేదిక‌గా మారింది. త‌న లోప‌లి భావాల్ని ఆయ‌న బ‌య‌ట‌పెట్టేందుకు ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌లేదు. ఎన్నిక‌ల సంఘం అన్న‌ది ఒక‌టి ఉంటుంద‌ని.. ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారు ఇష్టారాజ్యంగా మాట్లాడ‌టం కుద‌ర‌ద‌న్న విష‌యాన్ని ఆయ‌న ప‌ట్టించుకోలేదు.

వ్య‌వ‌స్థ‌ల ల‌క్ష్మ‌ణ రేఖ‌ల్ని లైట్ తీసుకునే జ‌గ‌న్‌.. తాజాగా నంద్యాల బ‌హిరంగ స‌భ‌లో బ‌రి తెగించేశారు. ప్ర‌భుత్వంపై త‌న‌కున్న అసంతృప్తిని వ్య‌క్తం చేసేందుకు ర‌క్త‌పు మాట‌ల్ని ఆయ‌న వాడేశారు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తిని న‌డి రోడ్డు మీద కాల్చి చంపినా త‌ప్పు లేదంటూ త‌న‌లోని తాలిబాన్ నాయ‌కుడ్ని తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే.. వ్య‌వ‌స్థ‌లు చూస్తూ ఉండిపోవ‌న్న విష‌యం జ‌గ‌న్‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

నంద్యాల‌లో తాను చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తటం.. ప్ర‌జాస్వామ్య‌వాదులు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం లాంటివి జ‌రిగిపోయాయి. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా క‌న్నెర్ర చేసింది. తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై 48 గంట‌ల్లో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ నంద్యాల ఉప ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి.. క‌ర్నూలు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేశ్ తాజాగా నోటీసులు జారీ చేశారు.

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్ని సుమోటోగా స్వీక‌రిస్తున్న‌ట్లుగా ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్ లాల్ వెల్ల‌డించారు. క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ నుంచి ఆయ‌న వివ‌ర‌ణ కోరారు. ఎన్నిక‌ల రూల్స్‌ను ఉల్లంఘించేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించి ఉంటే షోకాజ్ నోటీస్ జారీ చేయాల‌న్న ఆదేశాల్ని జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స‌న్న వెంక‌టేశ్ జ‌గ‌న్‌కు నోటీసులు జారీ చేశారు. 48 గంట‌ల్లో ఆయ‌న వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు.

‘చంద్రబాబును ముఖ్యమంత్రి అంటారా.. ముఖ్య కంత్రీ అంటారా..? చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిచంపినా తప్పులేదు. దొంగంటారా.. నీతిమంతుడంటారా..? ఇది దొంగల పాలనా.. ప్రజాపాలన అంటారా..? ఒక్క నిజం కూడా చెప్పని వాడిని నారా చంద్రబాబునాయుడు అంటారు..’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోనూ.. పార్టీ వ‌ర్గాల్లోనూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌న చంపుడు వార్త‌ల‌తో జ‌గ‌న్ లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల సంఘం నుంచి కొత్త చిక్కులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని ఊరికే అన‌లేదు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు