రైల్ కోచ్ ల‌లో ఒక టాయిలెట్ డిలీట్‌

రైల్ కోచ్ ల‌లో ఒక టాయిలెట్ డిలీట్‌

రైల్వేల‌ను మోడీ స‌ర్కారు ఏం చేయాల‌నుకుంటుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. మోడీ స‌ర్కారు ప‌వ‌ర్ లోకి  వ‌స్తే.. రైల్వేల రూపురేఖ‌లు మొత్తం మారిపోయి కొత్త విధానాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుందని.. స‌మ‌ర్థ‌మైన పాల‌న‌తో రైల్వేల‌లో ఉన్న జ‌డ‌త్వాన్ని పోగొడుతుందంటూ బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితుల్ని గ‌డిచిన మూడున్న‌రేళ్ల మోడీ పాల‌న‌లో క‌నిపిస్తోంది.

రిజ‌ర్వేష‌న్ ఛార్జీలు పెంపు మొద‌లు.. టికెట్ ర‌ద్దు చార్జీల ఫీజులు పెంచ‌టం.. రైల్వేల్లో సేవ‌ల‌కు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా కోత పెట్ట‌టం లాంటివి చూస్తున్న‌దే. రోజులు గ‌డుస్తున్న కొద్దీ రైల్వేల‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఎసీ బోగీల్లో అంద‌జేసే దుప్ప‌ట్ల‌కు కోత వేయ‌టం.. అదేమంటే.. ఒక్కో దుప్ప‌టిని వాష్ చేసేందుకు రూ.55 వ‌ర‌కూ ఖ‌ర్చు అవుతుందని.. అందుకే ఏసీ బోగీల్లో అందించే దుప్ప‌ట్ల‌కు చెల్లుచీటి ఇవ్వ‌నున్న‌ట్లుగా చెప్పటం తెలిసిందే.

ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో నిర్ణ‌యాన్ని తీసుకుంది కేంద్ర రైల్వే శాఖ‌. రైళ్ల‌ల్లో ప‌రిశుభ్ర‌మైన ఆహారాన్ని ప్ర‌యాణికుల‌కు అందించేందుకు వీలుగా తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తావిస్తోంది. రైలు కోచ్ ల‌లో ఉండే నాలుగు టాయిలెట్ల‌లో ఒక‌దాన్ని తీసేసి.. ఆ స్థానంలో ఫుడ్ ట్రేలు ఏర్పాటు చేస్తార‌ని చెబుతున్నారు.

ఫుడ్ ట్రే ఏర్పాటుతో బోగీలో ఉండే నాలుగు టాయిలెట్లు కాస్తా మూడు కానున్నాయి. ఈ విధానాన్ని రానున్న కొద్ది రోజుల్లో 40 వేల కోచ్ ల‌లో ఈ ఏర్పాటు చేస్తార‌ని చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ఇదే నిజ‌మైతే.. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు రైల్వే శాఖ స‌మాధానం చెప్పాల్సి ఉంది. టాయిలెట్ల స్థానంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ట్రేలు.. మ‌రో టాయిలెట్ల ఎదుటే ఉండ‌టం బాగుంటుందా?  దూర ప్రాంతాల‌కు ప్ర‌యాణించే రైళ్ల‌ల్లో ఇప్పుడు ఉంటున్న నాలుగు టాయిలెట్లే ప్ర‌యాణికుల అవ‌స‌రాల్ని తీర్చ‌లేని ప‌రిస్థితి. చాలా సంద‌ర్భాల్లో టాయిలెట్ల కోసం ప్రయాణికులు వెయిట్ చేసే ప‌రిస్థితి.

ఫుడ్ ట్రేల‌తోనే.. క్వాలిటీ ఆహారం అందుబాటులోకి వ‌స్తుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. కొత్త కొత్త‌గా నిర్ణ‌యాలు తీసుకునే బ‌దులు క్యాట‌రింగ్ స‌ర్వీసుల్లో ఉండే లోపాల‌పై రైల్వేశాఖ సీరియ‌స్ గా దృష్టా సారిస్తే ఫ‌లితం ఉంటుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకానీ.. అర‌కొర నిర్ణ‌యాలు.. దూర‌పు ఆలోచ‌న‌లు లేకుండా తీసుకుంటున్న హ‌డావుడి నిర్ణ‌యాల‌తో న‌ష్ట‌మే త‌ప్పించి లాభం ఉండ‌ద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు