చిరు గొప్పదనం చెప్పిన తమిళ నటుడు

మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథం గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. దాసరి నారాయణరావు మరణానంతరం టాలీవుడ్ పెద్ద పాత్రలోకి మారిన ఆయన.. ఎవరికి ఏ కష్టం అన్నా ముందుగా స్పందిస్తున్నారు. తన వంతుగా సాయం అందిస్తున్నారు. గత కొన్నేళ్లలో ఆయన్నుంచి ఎంతో మంది సాయం పొందారు. ఈ మధ్య కరోనాతో మరణించిన టీఎన్‌ఆర్ కుటుంబానికి ఆయన లక్ష రూపాయల సాయం అందజేయడం తెలిసిందే. నటి పావలా శ్యామల కష్టాల్లో ఉందని తెలుసుకుని ఆమెకు కూడా లక్ష రూపాయలు పంపించారు.

ఇక కరోనా వల్ల గత ఏడాది సినీ పరిశ్రమలో సంక్షోభం తలెత్తినప్పటి నుంచి చిరు చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా బాధితుల కోసమని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి కూడా చిరు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.


ఇదే సమయంలో చిరు పెద్ద మనసు గురించి ఒక తమిళ నటుడు వెల్లడించడం, ఆయన్ని కొనియాడటం విశేషం. ఆ నటుడెవరో కాదు.. 80, 90 దశకాల్లో తమిళ, తెలుగు చిత్రాల్లో విలన్‌గా మెప్పించిన పొన్నాంబళం. ఫైట్ మాస్టర్ కూడా అయిన పొన్నాంబళం చిరుతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు. ఐతే కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ సంగతి తెలిసి తమిళ సినీ పరిశ్రమలో పలువురు సాయం అందించడానికి ముందుకొచ్చారు.

చిరు సైతం పొన్నాంబళంకు రూ.2 లక్షలు అందజేశారట. ఈ విషయం చిరు ఏమీ చెప్పుకోలేదు. స్వయంగా ఇప్పుడు పొన్నాంబళమే ఒక వీడియో ద్వారా విషయం వెల్లడించారు. మధ్యలో అనారోగ్యంతో బాగా చిక్కిపోయి కనిపించిన పొన్నాంబళం సర్జరీ తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు హుషారుగానే కనిపిస్తున్నాడు. చిరు తనకు రూ.2 లక్షలు అందజేయడం గురించి వెల్లడిస్తూ కష్ట కాలంలో ఆ డబ్బు తనకెంతో ఉపయోగపడిందని, చిరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు పొన్నాంబళం. దీంతో మరోసారి చిరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.