హ్యాపీ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో శాస్త్రవేత్తలు హ్యాపీన్యూస్ చెప్పారు. ప్రస్తుత తీవ్రత జూలై నెలలో బాగా తగ్గిపోతుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ మొదటి వేవ్ తో పోలిస్తే సెకెండ్ వేవ్ యావత్ దేశాన్ని వణికించేస్తు సంక్షోభంలోకి నెట్టేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. చాలా రాష్ట్రాలు సెకెండ్ వేవ్ ను ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాక కుదేలైపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు కరోనా సెకెండ్ వేవ్ కట్టడిలో విఫలమై చేతులెత్తేశాయి.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నుండి ఉత్తర ప్రదేశ్ ను దేవుడే కాపాడాలని స్వయంగా హైకోర్టే వ్యాఖ్యానించిందంటే అక్కడ పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో సమస్య తీవ్రతను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం జూలైలో సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గిపోతుందన్నారు. అలాగే అందరు భయపడుతున్న మూడో వేవ్ 6-8 నెలల తర్వాత మాత్రమే ఉండవచ్చని అనుమానించారు. అయితే, జనాలందరు భయపడుతున్నట్లుగా అంత తీవ్రత ఉండకపోవచ్చని కూడా చెప్పారు.

మే నెలాఖరుకు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజుకు 1.5 లక్షలకు తగ్గిపోవచ్చని బృందం అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 4 లక్షలు దాటిన విషయం అందరికీ తెలిసిందే. 4 లక్షల మార్కు నుండి 1.5 లక్షలకు తగ్గటమంటే మంచి విషయమే. ఈ కేసుల సంఖ్య జూన్ చివరకు 20 వేలకు పడిపోతుందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్ధాన్, కేరళ, సిఖ్ఖిం, ఉత్తరాఖండ్, హర్యానా, గోవాలో కరోనా సెకెండ్ వేవ్ అత్యంత ఎక్కువగా ఉందని తెలిసిందే.

ఇక ఈనెల 19-30వ తేదీల మధ్య తమిళనాడు, పాండిచ్చేరి, పంజాబ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత తీవ్రదశకు చేరుకునే ప్రమాధముందని కేంద్ర ఆరోగ్యశాఖ అంచనా వేసింది. మూడోదశ స్ధానికంగా మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయిస్తే కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని కూడా శాస్త్రజ్ఞులు చెప్పటం హ్యాపీ న్యూసే కదా.