డ్రగ్స్ ఒక్క డోస్ ఇవ్వండి ప్లీజ్

డ్రగ్స్ ఒక్క డోస్ ఇవ్వండి ప్లీజ్

మాదక ద్రవ్యాలకు బానిసైన వాళ్లు.. అవి దొరక్కపోతే ఎలా ప్రవర్తిస్తారో కొన్ని సినిమాల్లో చూసే ఉంటాం. తెర మీద కనిపించే దృశ్యాలు అతిశయోక్తి ఏమీ కాదు. డ్రగ్స్‌కు బానిసైన వాళ్ల పరిస్థితి అలాగే ఉంటుంది. సమయానికి మత్తు ఎక్కకపోతే పిచ్చోళ్లయిపోతారు వాళ్లు. హైదరాబాద్ నగరంలో వందలాది మందిని డ్రగ్స్ బానిసలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన కెల్విన్ కూడా ప్రస్తుతం అదే పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం.

సెలబ్రెటీలకు డ్రగ్స్ అలవాటు చేయడాని కంటే ముందే కెల్విన్ వాటికి బానిస. అతను కూడా రోజూ డ్రగ్స్ తీసుకునేవాడు. పది రోజుల కిందట అరెస్టయి పోలీసుల కస్టడీలో ఉన్న కెల్విన్‌కు అప్పట్నుంచి మాదక ద్రవ్యాలు దొరకట్లేదు. దీంతో అతడి పరిస్థితి అయోమయంగా ఉందని.. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడని పోలీసులు చెబుతున్నారు.

వందలాది మందిని తన చుట్టూ తిప్పుకొని.. మత్తు కోసం కాళ్లావేళ్లా పడేలా చేసిన కెల్విన్‌ ఇప్పుడు అదే మత్తు కోసం విలవిల్లాడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పది రోజులుగా డ్రగ్స్ తీసుకోకపోవడంతో అతను పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నాడట. తనకు బిర్యానీ కావాలని.. సిగరెట్లు తెచ్చిపెట్టమని పేచీలు పెడుతూనే.. డ్రగ్స్ కోసం కూడా వేడుకుంటున్నాడట. తాను బయటికి వచ్చాక డబ్బులిస్తానని పోలీసులకు ఆశ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం.

కెల్విన్ డ్రగ్స్ కేసులో ఇంతకుముందు 2013లోనే అరెస్టయ్యాడు. జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా తాను బయటికి వచ్చి.. మళ్లీ వ్యాపారాన్ని కొనసాగిస్తానని జైల్లోనే అతను బాహాటంగానే చెబుతున్నాడట. మొదట్లో పోలీసుల విచారణకు సహకరించిన కెల్విన్.. తర్వాత సహాయ నిరాకరణ చేస్తున్నాడని, నోరు మెదపట్లేదని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు