బాబు....ప‌వ‌న్‌తో స‌డెన్‌ మీటింగ్ మ‌ర్మమేంటో

బాబు....ప‌వ‌న్‌తో స‌డెన్‌ మీటింగ్ మ‌ర్మమేంటో

నిరంతరం బిజీ షెడ్యూల్‌లో ప‌నిచేస్తున్న‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆస‌క్తిక‌రంగా మారింది. జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌ కళ్యాణ్ తో నేడు బాబు జరుపుతున్నప్ర‌త్యేక‌ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌ హార్వార్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతినిధుల బృందం సోమవారం చంద్రబాబును కలిసేందుకు ఇప్పటికే సమయాన్ని తీసుకుంది. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ వస్తుండటంతో ముందు ఖరారైన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చంద్రబాబు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నికలతో పాటు నంద్యాల ఉప ఎన్నికల ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్న చంద్రబాబు పవన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు లేకపోలేదని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సీఎం చంద్రబాబుని కలిసేందుకు పవన్‌ కళ్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కోరగా సోమవారం రావాల్సిందిగా బాబు చెప్పార‌ని టీడీపీ వ‌ర్గాల స‌మాచారం.  దీంతో ఉదయం 6 గంటలకు విమానంలో బయలుదేరి పవన్‌ కళ్యాణ్‌ నేరుగా అమరావతి వెళ్లి చంద్రబాబుతో భేటీ కానున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలతో పాటు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ వంటి అంశాలను పవన్‌ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని స‌మాచారం. విశాఖలో తాజాగా వెలుగుచూసిన భూముల కుంభకోణం, ఉద్దానం కిడ్నీ భాదితుల సమస్యలపై తమ పార్టీ అధ్యయనం చేసిన అంశాలను నివేదిక రూపంలో పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుకు అందజేయనున్నారని అంటున్నారు. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరపున గ్రామీణ ప్రాంతాల్లో వాటర్‌ ప్లాంట్లను, డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో కిడ్నీ సమస్య తలెత్తకుండా చూడాలని ఆయన చంద్రబాబును కోరనున్నట్లు సమాచారం.  రాజధాని నిర్మాణం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు, నదుల అనుసంధానం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు, అమరావతిలో జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, సాధిస్తున్న విజయాలను చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌తో జరిగే భేటీ సందర్భంగా పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇరువురి భేటీలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో మహా కూటమిని ఏర్పాటు చేసి తద్వారా ప్రజల్లోకి వెళ్లాలన్న చంద్రబాబు ప్రతిపాదనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి పోలింగ్‌, పార్లమెంట్‌ సమావేశాలు, నంద్యాల ఉప ఎన్నికతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నా పవన్‌ను కలిసేందుకు సమయం కేటాయించడం, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో రగిలిపోతున్న పవన్‌, సీఎం చంద్రబాబుతో భేటీ అవుతుండటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు