ధోతి ధరించాడని మాల్‌లోకి రానివ్వలేదు

ధోతి ధరించాడని మాల్‌లోకి రానివ్వలేదు

సంప్ర‌దాయాన్ని ఆధునిక‌త పేరుతో అడ్డుకోవ‌డం స‌మంజ‌స‌మేనా? నూత‌న పోక‌డ‌ల‌కు వేద అయినంత మాత్రాన వ్య‌క్తుల స‌హ‌జ శైలిని త‌ప్పుప‌ట్ట‌డం ఏమిటి? ఇలాంటి సందేహం మ‌రోమారు త‌లెత్తింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారత సంప్రదాయ దుస్తులు ధరించిన ఆ వ్యక్తికి తీవ్ర పరాభవం ఎదురైంది. ధోతి ధరించిన వ్యక్తిని లోపలికి ప్రవేశించకుండా క్వెస్ట్ మాల్ అనే సంస్థ యాజమాన్యం అడ్డుకుంది. ఈ ప‌రిణామం సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

కోల్‌క‌తాలోని క్వెస్ట్ మాల్‌లోకి ధోతి ధరించిన వ్యక్తి మాల్‌లోకి వెళ్తుండగా ప్రవేశద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ధోతి ధరించిన వ్యక్తులకు మాల్‌లోకి ప్రవేశం లేదని చెప్పడంతో బాధితుడు నివ్వెరపోయారు. ఆయన వెంట ఉన్న స్నేహితురాలు, కోల్‌కతాకు చెందిన నటి దేబ్‌లీన సేన్ ఈ తతంగమంతా వీడియో తీసి ఫేస్‌బుక్ పోస్టుచేశారు. "హోటళ్ల మాదిరిగా మరో మాల్ కూడా ఓ వ్యక్తి ప్రవేశాన్ని అడ్డుకుంది. ధోతి, కుర్తా ధరించిన వ్యక్తిని లోపలికి రాకుండా కోల్‌కతాలో క్వెస్ట్ మాల్ నో చెప్పింది. ధోతి, లుంగీ ధరించిన వ్యక్తులను లోపలికి అనుమతించబోమని మాల్ యాజమాన్యం చెప్తోంది."అని ఫేస్‌బుక్ పోస్టులో ఆమె తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌పై ప‌లువురు స్పందిస్తూ మాల్ నిర్వాహ‌కుల‌పై ఫైర్ అయ్యారు.

కాగా, గత నెలలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. సంప్రదాయ దుస్తులు ధరించారని ఈశాన్య రాష్ర్టానికి చెందిన ఓ మహిళను ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ యాజమాన్యం లోపలికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు