విదేశీ విద్యార్థుల మాట‌... అమెరికాలో చదువుకోలేం

విదేశీ విద్యార్థుల మాట‌... అమెరికాలో చదువుకోలేం

అగ్ర‌రాజ్యం అమెరికాలోని అత్యున్నత విద్యాసంస్థల్లో చదువుకోవాలనేది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అయితే ప్రస్తుతం అక్కడ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు మాత్రం తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది.

జూన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై నిషేధం విధించగా.. ఈ ఉత్తర్వులను అక్కడి సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ పరిణామం ఇతర దేశాల విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని నివేదిక తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు చెందిన అనేక విద్యాసంస్థలు మధ్య ఆసియా, భారత్‌కు చెందిన విద్యార్థులను చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. 31శాతం విద్యాసంస్థల్లో మధ్య ఆసియాకు చెందిన విద్యార్థులకు అడ్మిషన్లు లభించినప్పటకీ వారు చేరలేదు. మరో 20శాతం విద్యాసంస్థలు మాత్రం భారత విద్యార్థులు క్యాంపస్‌లో చేరే అవకాశాలు లేవని పేర్కొన్నాయి. అమెరికాలో భద్రతపై అత్యధిక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారని 46శాతం సంస్థలు తెలిపాయి. 41శాతం విద్యాసంస్థలు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థి సమూహంలో భారత్ రెండో స్థానంలో కొనసాగే అవకాశాలు భవిష్యత్తులో కనిపించడంలేదని ఐఐఈ నివేదికలో వెల్లడైంది. వీసాలు త్వరగా లభిస్తున్నాయనే కారణంతోనే చాలామంది ఇతర దేశాలకు వెళుతున్నారని తేలింది. 112 కళాశాలల్లోని గణాంకాలను పరిశీలిస్తే ప్రవేశాల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి 26శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నప్పటికీ భయాందోళనలతో వారు వెనుకంజ వేస్తున్నారని ఐఐఈ తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు