మ‌న టెకీల‌కు షాక్‌లు...అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు

మ‌న టెకీల‌కు షాక్‌లు...అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలతో దేశీయ ఐటీ సంస్థలు అక్కడి స్థానిక యువతకే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజాలు ఉద్యోగ కల్పనలో అమెరికన్లకు పెద్ద పీట వేయగా...తాజాగా ఈజాబితాలోకి టెక్ మహీంద్రా చేరింది. ప్రస్తుత సంవత్సరంలో 2,200 మంది అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు టెక్ మహీంద్రా ప్రెసిడెంట్ లక్ష్మణన్ చిదంబరం తెలిపారు.

గడిచిన కొన్నేళ్లుగా అమెరికా కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామ‌ని  టెక్ మహీంద్రా ప్రెసిడెంట్ లక్ష్మణన్ చిదంబరం వివ‌రించారు. ఈ ఏడాది కూడా మరో 2 వేల మందికి పైగా వీరినే తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. యూఎస్ ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాగా, గడిచిన సంవత్సరంలో కూడా ఇంతే స్థాయిలో ఉద్యోగస్తులను నియమించుకుంది. టెక్ మహీంద్రాకు అతిపెద్ద మార్కెటైన యూఎస్‌లోని 28 నగరాల్లో సేవలను అందిస్తోంది. ముంబై కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న టెక్ మహీంద్రా ఇప్పటికే అమెరికాలో 6 వేల మంది సిబ్బంది ద్వారా 400 క్లయింట్లకు సేవలు అందిస్తోంది. 16 డెవలప్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా 1.17 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.


అమెరికాతోపాటు సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు అనుసరిస్తున్న విధానాలతో దేశీయ ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో టెక్ మహీంద్రాతో సహా పలు కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేశాయి కూడా. అయితే ఈ వేటులో భాగంగా అత్యంత వివాదాస్పదంగా మారిన సంస్థ టెక్ మ‌హీంద్రా. దేశీయంగా ఉన్న వారిని ఊడబీకుతూ అమెరికాలోని వారికి కొలువులు ఇస్తున్నార‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు