కొత్త మంత్రులు 100 రోజుల్లో ఏం చేశారు..

కొత్త మంత్రులు 100 రోజుల్లో ఏం చేశారు..

ఏపీ మంత్రివర్గంలో మార్పు, చేర్పులు చేసి వందరోజులు పూర్తయ్యాయి. కొత్త మంత్రులతోపాటు, కొందరు మంత్రులకు శాఖలు మారాయి. మరి ఈ 100 రోజుల్లో వారు తమతమ శాఖల నిర్వహణలో ఎంతవరకు ప్రతిభ చూపారన్ని చూద్దాం.

    వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఈ 100 రోజుల్లో రాజకీయంగా, శాఖాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఐటి పరిశ్రమలను తీసుకువచ్చి, ప్రారంభించడంలో మంత్రి లోకేష్ కూడా కొంతవరకు ప్రతిభ కనబరిచారు. సోమిరెడ్డి రాజకీయంగా జగన్‌పై ఎదురుదాడి, శాఖాపరంగా వ్యవసాయంపై నిరంతర సమీక్షలు, నకిలీ పురుగుమందులు, విత్తనాల కంపెనీల సీజ్‌తోపాటు, నష్టపోయిన రైతులకు కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పించారు. అదేవిధంగా మిర్చికి మద్దతుధర క్వింటాలుకు 1500 రూపాయలు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. కడప జిల్లా ఇంచార్జి మంత్రిగా ఆయన యాక్టివ్ గానే పనిచేశారు. జగన్‌పై ఎదురుదాడిలో ఆయనే ముందున్నారు.

    బాబు వారసుడిగా క్యాబినెట్‌లో చేరిన లోకేష్ నోరు జారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, తాను నిర్వహిస్తున్న మూడు శాఖల్లో 130కిపైగా సమీక్షలు నిర్వహించారు. ఈ వందరోజుల్లో ఆయన ఎక్కడా మీడియా సమావేశాలు నిర్వహించలేదు. 14ఐటి కంపెనీలను ప్రారంభించారు. హెచ్‌సీఎల్ వంటి ప్రతిష్ఠాత్మకమైన కంపెనీ కూడా అందులో ఒకటి కావడం విశేషం.

    పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు, విద్యుత్ శాఖ మంత్రిగా వివాదరహితుడైన కళా వెంకట్రావు తన ద్విముఖ పాత్రను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ టికెట్లు, నంద్యాల వివాదం, జిల్లా పార్టీ వ్యవహారాలతోపాటు, విద్యుత్ శాఖ సమీక్షల్లో బిజీగా గడిపారు.

    సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వైసీపీపై ఎదురుదాడితోపాటు, శాఖాపరమైన వ్యవహారాల్లో నాయకత్వాన్ని మెప్పించారు.

    సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ భూకుంభకోణంపై చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించినప్పటికీ, శాఖపరంగా సమర్థంగానే వ్యవహరించారు.

    కార్మికమంత్రి పితాని సత్యనారాయణ సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న గుంటూరు బజరంగ్ జూట్‌మిల్ కార్మిక సమస్యల ఫైల్‌ను దుమ్ముదులిపి, వారిని చర్చలకు పిలిపించి తన అనుభవాన్ని చాటుకున్నారు. దానితోపాటు రాజమండ్రి పేపర్ మిల్లు సమస్య కూడా కొలిక్కితెచ్చారు. విజయనగరం జూట్‌మిల్లు సమస్య పరిష్కారం కోసం చర్చలకు తెరలేపారు. అన్ని పార్టీలకు చెందిన ట్రేడ్‌యూనియన్లతో తొలిసారి భేటీ నిర్వహించారు.

    అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఎర్రచందనం, అటవీప్రాంతాల్లో మొక్కల పెంపకం, డ్రోన్లతో నిఘా, అటవీ సిబ్బందికి ఆయుధాలను ఇవ్వాలన్న ప్రతిపాదనలతోపాటు, వైసీపీపైనా ఎదురుదాడితో నాయకత్వాన్ని మెప్పించారు.
    కొత్తశాఖకు మారిన పరిటాల సునీత కూడా నాయకత్వాన్ని మెప్పిస్తున్నారు. అదేవిధంగా శాఖ మారిన అచ్చెన్నాయుడు రాజకీయంగా జగన్‌పై ఎదురుదాడి చేయటంలో ముందున్నప్పటికీ, రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిపై ఎంపి-అధికారుల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించలేకపోయారని, మిగిలిన శాఖలపై ఇంకా పట్టుసాధించలేకపోయారంటున్నారు.

    ఇక కొత్తగా మంత్రి అయిన భూమా అఖిలప్రియ నియోజకవర్గ స్థాయి నుంచి శాఖాపరమైన వ్యవహారాల్లోనూ పనితీరు అంతంతమాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని సమీక్షలు నిర్వహించినప్పటికీ, ఆమె రాజకీయాల్లో వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు.

    సుజయ కృష్ణ రంగారావు ఉండీలేనట్లు వ్యవహరించారు. ఆయనకు ఇంకా చాంబరు కూడా కేటాయించలేదు. ఎక్సైజ్ మంత్రి జవహర్ బీరుపై చేసిన వ్యాఖ్యలు, వైన్‌షాపులు-బార్ల తరలింపుపై తీసుకున్న నిర్ణయం మహిళలను వ్యతిరేకతకు కారణమయంది. మరో మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం సమస్యలు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమయ్యారంటున్నారు. ఆరుశాఖలు తీసుకున్న కొల్లు రవీంద్ర ఏ శాఖలోనూ ప్రతిభ కనబరచలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదినారాయణరెడ్డి పని తీరు అంతంతమాత్రంగానే ఉందన్నది టీడీపీలో వినిపిస్తున్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు