జగన్ జీ.. ఈ వాదన కరెక్టేనా?


ఇండియాలో వ్యాక్సిన్ ఉత్పత్తి దిశగా అత్యంత వేగంగా పరిశోధనలు చేసి ‘కోవాగ్జిన్’ పేరుతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి.. దాని పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది భారత్ బయోటెక్ సంస్థ. కరోనా కథ మొదలవడానికి చాలా ఏళ్ల ముందు నుంచే వ్యాక్సిన్, డ్రగ్స్ తయారీలో భారత్ బయోటెక్‌కు మంచి పేరుంది. ఈ సంస్థ యాజమాన్యంలో భాగమైన రేచస్ ఎల్లాకు రామోజీ మనవరాలికి కొన్నేళ్ల ముందు పెళ్లి జరిగింది. అప్పుడు భారత్ బయోటెక్ గురించి మీడియాలో పెద్దగా చర్చ లేదు. కానీ కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడం ద్వారా భారత్ బయోటెక్ పేరు మార్మోగింది. రామోజీ కుటుంబంతో వియ్యం పొందిన వారి కంపెనీ అంటూ ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐతే రామోజీది కమ్మ సామాజిక వర్గం కాబట్టి వియ్యం అందుకున్న వాళ్లదీ అదే కులం అయ్యుంటుందన్న అభిప్రాయం జనాల్లో ఉంది. అంతకుమించి దీని గురించి పెద్ద చర్చ లేదు.

ఐతే వ్యాక్సినేషన్ విషయంలో బాగా వెనుకబడి ఇప్పుడు దేశంలోనే అతి తక్కువ వ్యాక్సిన్ నిల్వలున్న రాష్ట్రాల్లో ఒకటిగా అప్రతిష్ట ఎదుర్కొంటున్న జగన్ సర్కారు.. ఈ విషయంలో నిందను ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు రామోజీ రావు మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తుండటమే విడ్డూరం. మిగతా రాష్ట్రాల మాదిరి దూరదృష్టితో వ్యవహరించి వ్యాక్సిన్ కోసం కంపెనీలకు అడ్వాన్సులు ఇవ్వడంలో జగన్ సర్కారు విఫలమైందన్నది స్పష్టం. పూర్తిగా కేంద్రం మీదే ఆధారపడటంతో వచ్చిన దుస్థితి ఇది. కానీ వైకాపా మంత్రులు మాత్రం చిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు.

చంద్రబాబుకు రామోజీ సన్నిహితుడు కాబట్టి.. ఆయన ద్వారా భారత్ బయోటెక్ వారికి చెప్పి కోవాగ్జిన్ డోసులు ఏపీకి రాకుండా అడ్డుకుంటున్నారట. మంత్రులకు తోడు ఎంపీ విజయసాయిరెడ్డి చూపిన చొరవతో దీనిపై సోషల్ మీడియాలో వైకాపా ఉద్ధృతంగా ప్రచారం చేస్తోంది. ఐతే ఏపీ మంత్రులు, విజయసాయి ఇలాంటి ప్రచారాలు చేయడం, వాటిని వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలు అందుకోవడం కొత్తేమీ కాదు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహరించాల్సిన జగన్ కూడా మీడియా ముందు ఇదే రకమైన ఆరోపణలు చేయడమే విడ్డూరం. మధ్యలో రామోజీ లింకును కూడా పక్కన పెట్టేసి.. చంద్రబాబుకు భారత్ బయోటెక్ అధినేత బంధువు అంటూ ఈ వ్యవహారానికి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూ తరహాలోనే ‘కులం’ ముద్ర వేయడానికి చూశారు జగన్.

జనాల ప్రాణాలు పోతుంటే, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రతిపక్ష నేత, ఒక మీడియా సంస్థ అధినేత ఇలా చేస్తారని నమ్మగలమా? వీళ్లు అడిగినా వ్యాక్సిన్ తయారీ సంస్థ ఏ ప్రాతిపదికన అందుకు అంగీకరిస్తుంది? ప్రయారిటీ ప్రకారం ఏపీకి వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటన చేయడం ఇక్కడ గమనార్హం. అయినా కోవాగ్జిన్ విషయంలో బాబు, రామోజీ అడ్డు పడుతున్నారనుకుందాం. మరి కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఏపీ ఎందుకు తెచ్చుకోలేకపోయింది.. వాటిని అడ్డుకుంటున్నది ఎవరు? తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ‘కులం’ లింకు కలిపి ఇలాంటి నిందలు వేయడం ఎంత మాత్రం హుందాగా అనిపించుకోదని జగన్ అర్థం చేసుకుంటే మంచిది.