కేంద్రానిది మరీ ఇంత ఓవర్ యాక్షనా ?

పశ్చిమబెంగాల్ విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మరీ ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన 77 మంది బీజేపీ ఎంఎల్ఏలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించబోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండి రెండు రోజుల పాటు బెంగాల్లో కొన్ని అవంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతలు, కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడులు చేసి విధ్వంసం సృష్టించినట్లు బీజేపీ నేతలు గోలపెట్టారు.

ఇదే సమయంలో ఓడిపోయిన బీజేపీ నేతలే తమ కార్యకర్తలపై దాడులు చేసి ఎదురు తమమీదే ఆరోపణలు చేస్తున్నట్లు తృణమూల్ నేతలు ఎదురుదాడులకు దిగారు. దాంతో బెంగాల్లో వాస్తవంగా ఏమి జరిగిందనే విషయంలో గందరగోళం పెరిగిపోయింది. ఇదే సమయంలో తృణమూల్ నేతల దాడులంటు కొన్ని ఫొటోలను బీజేపీ సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఆ ఫొటొల్లో చాలావరకు ఫేక్ ఫొటోలే అని తేలిపోయింది.

ఎప్పుడో జరిగిన అల్లర్ల ఫొటోలు, వీడియోలను తాజాగా జరిగినట్లు బీజేపీ సర్క్యులేట్ చేస్తోందని బయపడింది. అయినా బీజేపీ నేతలు వాటినికి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. అల్లర్ల విషయమై మమతబెనర్జీ-గవర్నర్ మధ్య కూడా రచ్చ మొదలైపోయింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర పోలీసుల భద్రతపై తమకు నమ్మకం లేదంటు కేంద్ర హోంశాఖ ఓ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే బీజేపీ నుండి గెలిచిన 77 మంది ఎంఎల్ఏలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని.

77 మంది ఎంఎల్ఏల కోసం సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రాష్ట్రంలోకి దిగేశాయి. వీరిలో 61 మంది ఎక్స్ క్యాటగిరి భద్రతను మిగిలిన వాళ్ళకు వై క్యాటగిరి భద్రత కల్సించబోతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారికి ఇప్పటికే ఉన్న జడ్ క్యాటగిరి భద్రత కంటిన్యు అవుతుంది. మొత్తానికి జరుగుతున్నది చూస్తుంటే బీజేపీ చాలా ఓవర్ యాక్షనే చేస్తున్నట్లుంది. బెంగాల్లో జరుగుతున్నది చూసిన తర్వాత 213 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మమతను ప్రశాంతంగా ఉండనిస్తారా అనే డౌట్లు పెరిగిపోతున్నాయి.