ప్రభాస్ సైన్స్ ఫిక్షన్.. సింగీతం బయిటకు?!

టెక్నాలిజీ అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచిన డైరక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన సేవలను వైజయంతి మూవీస్ వారు వినియోగించుకున్నామని ఆ మధ్యన అఫీషియల్ గా ప్రకటించారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారని తెలియచేసారు.

ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథల్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో సింగీతంది అందెవేసిన చేయి. ఆయన ఇరవై ఏళ్ల క్రితమే ‘ఆదిత్య 369’తో సైన్స్‌ ఫిక్షన్‌ ప్రయోగం చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. అటు పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి చిత్రాలను తెరకెక్కించి గొప్ప దర్శకుడిగా పేరును సంపాదించుకున్నారు సింగీతం..

అందుకే ఆయన సలహాలు, సూచనలు ఈ చిత్రానికెంతో ఉపయోగపడతాయని భావించి టీమ్ లో సభ్యుడిగా చేర్చుకుంది వైజయంతి సంస్థ. చిత్ర టీమ్ కి తనదైన సూచనలు, సలహాలు ఇస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత సింగీతం పుట్టినరోజు సందర్భంగా టీమ్ శుభాకాంక్షలు చెబుతూ, ఆయన సృజనాత్మక ఆలోచనలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని చిత్ర టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడో వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సింగీతం ఆ టీమ్ లోంచి బయిటకు వచ్చేసారని చెప్పుకుంటున్నారు. కోర్ టీమ్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ లతో ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో దీపిక పదుకొణె హీరోయిన్. ఓ చక్కటి సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ కథాశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.