కాలిపోతున్న పేదోడి ఇంటిముందు ఎమ్మెల్యే సెల్ఫీ

కాలిపోతున్న పేదోడి ఇంటిముందు ఎమ్మెల్యే సెల్ఫీ

సెల్ఫీల పిచ్చి రాజకీయ నాయకులను ఇబ్బందులపాలు చేస్తోంది. సమయం సందర్భం చూసుకోకుండా సెల్ఫీలు దిగి నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ లో ఓ బీజేపీ నేత ఇలాగే ఇరకాటంలో పడ్డారు. పేదల ఇళ్లు తగలబడుతుంటే అక్కడ ఆయన సెల్ఫీ దిగడం వివాదాస్పదమైంది.

రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని బయానా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నిరుపేదల గుడిసెలు కాలిపోయాయి. ఆ సమాచారం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధి బీజేపీ ఎమ్మెల్యే బచ్చు సింగ్ కు కూడా అందింది. వెంటనే ఆయన  సంఘటనా స్థలికి వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతుండగా, ఎమ్మెల్యే బాధితులను ఆదుకుంటామని చెప్పి...మంటలు కనిపించేలా సెల్ఫీ దిగి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

దీనిపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇల్లు కాలుతుంటే చూరునున్న అగ్గితో చుట్టవెలిగించుకున్నాడన్న సామెత గుర్తుకొస్తోందని ఒక నెటిజన్ మండిపడగా, ఏ సమయంలో సెల్ఫీ దిగాలో కూడా ప్రజాప్రతినిధికి తెలియదా? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యే తన ఫేస్ బుక్ పోస్టును తొలగించారు.

కాగా ఇంతకుముందు మహారాష్ర్టలో కరువు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పంకజ ముండే కూడా ఇలాగే అక్కడ సెల్ఫీలు దిగడం వివాదాస్పదమైంది. తెలుగు రాష్ర్టాల్లోనూ పలువురు నేతలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు