షర్మిల చేతికి ఫ్యాక్చర్.. లోటస్ పాండ్ లో అనూహ్య దీక్ష

తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల.. తన అనూహ్య నిర్ణయాలతో రాష్ట్రంలో వేడి రగులుస్తున్నారు. ఉద్యోగాల నోటిఫిషన్ విడుదల చేయని తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టిన ఆమె.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు సంధించటం తెలిసిందే. ఒక రోజు దీక్ష కాస్తా అనూహ్యంగా పాదయాత్రగా మారటం.. పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

తొలుత బొల్లారం పోలీస్ స్టేషన్ కు తీసుకెళతారని.. తర్వాత బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లుగా ప్రచారం జరిగినా.. చివరకు లోటస్ పాండ్ వద్ద ఆమెను దింపారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద షర్మిలను అదుపులోకి తీసుకునే వేళ.. పోలీసులకు ఆమెకు మద్దతుగా నిలిచిన వారి మధ్య పెద్ద ఎత్తున పెనుగులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె సొమ్మసిల్లి పడిపోవటం తెలిసిందే. ఆమెను బలవంతంగా మహిళా కానిస్టేబుళ్లు వాహనంలోకి బలవంతంగా తరలించారు.

ఈ క్రమంలో ఆమె చేతికి గాయం కావటంతో పాటు.. ఫ్యాక్చర్ అయినట్లుగా చెబుతున్నారు. అయినప్పటికి వైద్యం చేయించుకోవటానికి ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. లోటస్ పాండ్ లోపల ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కూర్చున్న ఆమె.. అనూహ్యంగా నిరాహార దీక్షను షురూ చేశారు. తనను అదుపులోకి తీసుకునే క్రమంలో.. తన మద్దతుదారుల్ని పెద్ద ఎత్తున పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో ఉన్న వారందరిని వెంటనే విడుదల చేయాలని.. అప్పటి వరకు తాను పచ్చి మంచినీళ్లు కూడా తాగనని ఆమె తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు.

ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతకు తెర తీసేలా మారిందని చెబుతున్నారు. ఒకవైపు.. షర్మిల ఆరోగ్యంపై ఆమె మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. వాటిని పట్టించుకోకుండా తనకు అండగా నిలిచిన వారిని అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ.. వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. పోలీసుల నిర్ణయం ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.